‘పెద్ది’ సినిమా విడుదలయ్యాక.. ఆ సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం, సినిమాలో చూపించిన ప్రధాన కథాంశం లాంటివి పక్కన పెట్టేసి.. ఒకే ఒక అంశం గురించి చాలా మంది మహిళా పక్షపాతులు, నెటిజన్లు, సమాజోద్ధారకులు మాట్లాడరు. సినిమాలో హీరోయిన్ పాత్ర చిత్రణ, దుస్తులు, చూపించిన విధానం గురించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒక హీరోయిన్ పాత్రను అలా చూపించడం సరైంది కాదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆగ్రహం గురించి అర్థం చేసుకొని దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పారు.
ఈ విషయం ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అచ్చంగా బుచ్చిబాబు లాగా కాకపోయినా.. ‘ప్యారడైజ్’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే పని చేశారు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇబ్బందికరంగా రాసుకున్నారు, అంతకుమించిన ఇబ్బందికరంగా తెరకెక్కించారు. ఇప్పుడు థియేటర్లలో ఆ పాత్రను, చూపించిన విధానాన్ని చూసి కొంతమంది పెదవి విరుస్తున్నారు. సుబ్బు పాత్రలో కయాదు లోహర్‌ను చూసి ఆమె కష్టం గురించి కూడా పాత్ర తీరు గురించే మాట్లాడుతున్నారు.
వెండితెరపై తన ప్రతిభను చూపించాలని, కథానాయిక కావాలని సుబ్బు పాత్ర కలలు కంటుంది. తల్లి వద్దని చెప్పినా మద్రాస్ ట్రైన్ ఎక్కుతుంది. సినిమాల్లో అవకాశాలు రావు. దాంతో చనిపోవాలని ఫిక్స్ అవుతుంది. దీంతో చివరిసారిగా ఇంటికి వస్తుంది. అక్కడ తండ్రి చేసిన అప్పు తీర్చలేదని తల్లిని ఓ వ్యక్తి దూషిస్తాడు. తండ్రి ఫోటోపై ఉమ్మేస్తాడు. దాంతో ఎలాగైనా అతడి అప్పు తీర్చాలని సుబ్బు డిసైడ్ అవుతుంది. డబ్బుల కోసం B గ్రేడ్ సినిమాల్లో నటిస్తుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గ్లామర్ పేరుతో ఇలాంటి సన్నివేశాలు తీయడం ఏంటి? అని విమర్శిస్తున్నారు. సుబ్బు పాత్ర అలా మారడం వెనుక కారణం, వెనకేసుకు రావడం లాంటి సీన్లు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎమోషనల్‌గా ఆ సీన్లు కలిసొస్తాయేమో అనుకుంటే.. ఇంకా ఇబ్బందికరంగా అనిపించాయి.
అయితే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రను చూపించిన తీరుపై విమర్శల విషయంలో చూపించినంత వేడి ఇప్పుడు ఆ సమాజోద్ధారకులు చూపించడం లేదు. బుచ్చిబాబు ఎదుర్కొన్న స్థాయి విమర్శలు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలకు రావడం లేదు. అయినా బుచ్చిబాబు సారీ చెప్పినట్లు శ్రీకాంత్ ఓదెల కూడా చెబుతారా? ఏమో చూడాలి.