కెరీర్ తొలినాళ్లలో రవితేజపై శ్రీనువైట్ల నమ్మకం పెట్టుకున్నారు. నీకోసం అంటూ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఇద్దరి సినీ ప్రయాణానికి దోహదం చేసింది. ఆ తర్వాత వెంకీ, దుబాయ్ శ్రీను అంటూ రెండు హిట్స్ అందుకున్నారు. హిట్ కాంబినేషన్ అంటే ఇదే. ఒకరిమీద మరొకరు నమ్మకం పెట్టుకుంటే ఇలాంటి విజయాలే వస్తాయి. రవితేజ స్టార్ హీరోగా.. శ్రీను వైట్ల స్టార్ డైరక్టర్ గా ఎదిగారు. ఇద్దరిలో శ్రీను వైట్ల పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. అయినా రవితేజ అతనిపై నమ్మకంతో సినిమాకి ఓకే చెప్పారు. ఇద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న నాలుగో సినిమా “అమర్ అక్బర్ ఆంటోని”.
గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీ పరిసరాల్లోని సన్ షైన్ ఆస్పత్రిలో రవితేజపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడి సన్నివేశం సినిమాలో కీలకమని సమాచారం. ఈ షెడ్యూల్ అనంతరం అమెరికాలో భారీ షెడ్యూల్ ని శ్రీనువైట్ల ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ కామెడీ హైలెట్ కానుందని తెలిసింది. ఇంకా మరెన్నో విశేషాలు నిండిన ఈ మూవీ శ్రీనువైట్ల ని హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు నమ్ముతున్నారు.