టాలీవుడ్ ఒక కుటుంబం లాంటిది.. ఒక సినిమాకు కష్టం వచ్చినా అందరూ స్పందిస్తారు. ఆ కష్టం తొలగేంతవరకు కష్టపడతారు. – ఏంటీ జోకులేస్తున్నారా అంటారా? కచ్చితంగా జోక్ అయితే కాదు. ఎందుకంటే మేం అంటున్న టాలీవుడ్ ఎలా ఉండాలి అని చెప్పడం. ఈ మాటలు వినడానికి చాలా హార్ష్‌గా అనిపిస్తాయి కానీ ‘విష్ణు విన్యాసం’ సినిమా టీమ్ చెప్పిన విషయాలు వింటుంటే.. వాటిపై ఇప్పటివరకు టాలీవుడ్ నుండి ఎలాంటి రియాక్షన్ కనిపించకపోయేసరికి ఈ మాటలు బయటకు వచ్చాయి.
తమ సినిఆ లీక్ అవడం వల్ల చాలా విషయాలు జరిగాయని అందుకే వారం గ్యాప్‌తో తన రెండు సినిమాలు విడుదల చేయాల్సి వచ్చిందని యువ కథానాయకుడు శ్రీవిష్ణు తెలిపారు. ఆయన హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ‘విష్ణు విన్యాసం’ విడుదలైన మంచి టాక్ సంపాదించిన సందర్భంగా టీమ్ మీడియాతో మాట్లాడింది. చెన్నై నుండి ఈ సినిమాను లీక్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై కేసు నడుస్తోంది. అదే సమయంలో లీక్ చేసినవారు మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారని శ్రీవిష్ణు తెలిపారు.
నిర్మాతను బెదిరిస్తూ వాళ్లు పెట్టిన మెసేజ్‌లు, అలాగే ఈ విషయంలో ఛాంబర్‌కు చేసిన ఫిర్యాదులు తమ దగ్గర ఉన్నాయని చెప్పిన శ్రీవిష్ణు.. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే సినిమా టీమ్ రెండు నెలలకుపైగా ఇబ్బందిపడింది. ఛాంబర్‌కి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అన్నారు కాబట్టి వారేం చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సినిమా టీమ్‌కి తెలిసిన వ్యక్తులే ఈ పని చేశారని కూడా చెబుతున్నారు.
ఇదంతా చూస్తుంటే సినిమా పరిశ్రమ ఎందుకిలా తయారైందనే ప్రశ్న వినిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇలానే జరిగినప్పుడు ఇండస్ట్రీ కాస్త స్పందించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఇలా జరిగింది. ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’ సినిమాకు జరిగింది. ఇప్పటికి కూడా సినిమా పరిశ్రమ స్పందించకపోతే కష్టమే. చూద్దాం ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడతారేమో.