బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

  • June 10, 2020 / 10:48 AM IST

స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ. ఈ నందమూరి అందగాడు చేయని పాత్ర లేదు, చేపట్టని ప్రయోగం లేదు. పౌరాణికం నుండి ఫిక్షన్ దాకా, మాస్ నుండి క్లాస్ దాకా, సోసియో ఫాంటసీ నుండి హిస్టారిక్ ఇలా అన్ని రకాల సినిమాలు, పాత్రలు బాలయ్య చేశారు. హీరోగా వంద చిత్రాలు పూర్తి చేసిన బాలకృష్ణ నేడు 60వ వసంతంలోకి అడుగిడనున్నాడు. దశాబ్దాలుగా తెరపై తన నటనతో అలరిస్తున్న బాలయ్య జీవితంలో మీకు తెలియని కొన్ని అరుదైన విషయాలు మీకోసం సేకరించడం జరిగింది. అవి ఏమిటో చూద్దాం..

పుణ్య దంపతుల ఆరో సంతానం.

1960 జూన్ 10న బసవ తారకం- తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ. ఎన్టీఆర్‌ దంపతులకు ఆరో కొడుకుగా బాలయ్య జన్మించారు. చెన్నైలో పుట్టిన బాలకృష్ణ డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజీలో పూర్తిచేశారు .

వెండితెర పరిచయం:


నటుడిగా బాలయ్య తాతమ్మ కల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటికి బాలయ్య వయసు కేవలం పద్నాలుగేళ్లు మాత్రమే. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల మూవీలో ఎన్టీఆర్ మనవడిగా బాలకృష్ణ చేయడం విశేషం. ఆ మూవీలో బాలకృష్ణ బామ్మ పాత్ర భానుమతి చేశారు. ఆ చిత్రానికి ముందే ఎన్టీఆర్ సినిమాలలో ప్రాధాన్యం లేని పాత్రలలో బాలకృష్ణ చేయడం విశేషం.

వివాహం:

బాలకృష్ణ కేవలం 22ఏళ్లకే వసుంధరను పెళ్లి చేసుకున్నారు. 1982లో వీరి వివాహం జరుగగా బ్రాహ్మణి, తేజస్విని మరియు మోక్షజ్ఞ వీరి ముగ్గురు సంతానం

తండ్రి ఎన్టీఆర్‌ తో కలిసి 12చిత్రాలలో నటించిన ఏకైక హీరో

హీరోగా బాలకృష్ణ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోక ముందు ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’,దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో నటించారు. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది.

సాహసమే జీవితంతో మొదలైన ప్రయాణం

బాలకృష్ణ మొదటి సారి సోలో హీరోగా నటించిన చిత్రం ‘సాహసమే జీవితం’. ఈ చిత్రానికి భారతీ- వాసు డుయో దర్శకులుగా పనిచేశారు. 1984లో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.

అత్యధిక చిత్రాలు ఆ ఆదర్శకుడితోనే.

అప్పట్లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏ. కోదండరామిరెడ్డి మరియు బాలయ్యలది హిట్ కాంబినేషన్. నారి నారి నడుమ మురారి, బొబ్బిలి సింహం, భలే దొంగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో అత్యధికంగా 13 చిత్రాలు వచ్చాయి. అందులో 9 చిత్రాలు హిట్టైయితే.. 4 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

టైటిల్ లో సింహం వచ్చేలా

స్వతహాగా లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అయిన బాలకృష్ణకు సింహం కలిసొచ్చేలా టైటిల్ పెట్టడం ఓ సెంటిమెంట్. అలా ఆయన ఎనిమిది చిత్రాలలో సింహం పేరు వచ్చేలా టైటిల్స్ పెట్టుకోవడం జరిగింది. ‘సింహం నవ్వింది, ‘బొబ్బిలి సింహం, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా వంటి 8 చిత్రాలకు ఆయన టైటిల్ లో సింహ పెట్టుకున్నారు.

పోలీస్ గా 12సార్లు

పవర్ ఫుల్ డైలాగ్స్, ఫెరోషియస్ నటనకు పెట్టింది పేరైన బాలకృష్ణ పోలీస్ పాత్రలకు బెస్ట్ ఛాయిస్. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 12 చిత్రాలలో పోలీస్ గా కనిపించారు. ‘భలే తమ్ముడు’, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్‌స్పెక్టర్, మాతో పెట్టుకోకు,సుల్తాన్, భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా,అల్లరి పిడుగు, రూలర్ చిత్రాలలో ఆయన పోలీస్ గా కనిపించడం జరిగింది. రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో బాలయ్య నటన గూస్ బంప్స్ కలిగిస్తుంది.

ఒక్క ఏడాదిలో 8సినిమాలు విడుదల.

1987లో బాలకృష్ణ నటించిన 8 చిత్రాలు విడుదలయ్యాయి. అపూర్వ సహోదరులు,భార్గవ రాముడు,రాము, అల్లరి కృష్ణయ్య,సాహస సామ్రాట్,ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య కెరీర్ లో అత్యధిక చిత్రాలు విడుదలైన ఏడాది అదే.

విజయశాంతితో ఎన్ని చిత్రాలు చేశాడంటే.

బాలకృష్ణ-విజయశాంతిలది సూపర్ హిట్ పెయిర్. దర్శక నిర్మాతలు కూడా బాలయ్య సినిమాకు మొదటి ఛాయిస్ గా విజయశాంతిని ఎంచుకొనే వారు. దీనితో బాలయ్య అత్యధికంగా విజయశాంతితో 17చిత్రాల్లో కలిసి నటించారు. మొదటిసారి కథానాయకుడు సినిమాలో కలిసి నటించిన వీళ్లిద్దరు చిరవగా నిప్పురవ్వ సినిమాలో జోడిగా కనువిందు చేశారు. ముద్దుల మావయ్య, భలే దొంగ, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవ రాముడు, లారీ డ్రైవర్ వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి.

బాలయ్య ల్యాండ్ మార్క్ చిత్రాలు ఇవే.

బాలకృష్ణ 25వ చిత్రం నిప్పులాంటి మనిషి ఎస్.బి.చక్రవర్తి డైరెక్ట్ చేసారు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’ ఏ. కోదండరామిరెడ్డి డైరెక్డ చేసారు. 75వ చిత్రం కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్ట్ చేసారు.

డాన్ గా బాలయ్య ఐదు సార్లు

ఏహీరో కైనా డాన్ రోల్ చేయాలన్నది ఓ క్రేజీ కోరికగా ఉంటుంది. బాలయ్య డాన్ గా నిప్పులాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, అశోక చక్రవర్తి, యువరత్న రాణా, సుల్తాన్ చిత్రాల్లో మొత్తం ఐదుసార్లు నటించారు.

తండ్రి వలె అనేక పౌరాణిక పాత్రలు చేసిన బాలయ్య.

తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో పాటు శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన బాలయ్య. తండ్రి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక, ఛారిత్రక పాత్రలను పోషించారు. ఇది కూడా ఓ అరుదైన రికార్డు అని చెప్పుకోవాలి.

ఇక తండ్రి బయోపిక్ చేసిన ఏకైక హీరో

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో తన తండ్రి పాత్రను బాలకృష్ణ చేశారు. తండ్రి బయోపిక్‌లో నటించిన ఏకైక హీరోగా బాలయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లోొ ఎన్టీఆర్ పోషించిన దాదాపు అన్ని పాత్రలను బాలయ్య చేసి చూపించారు.

తండ్రి కొడుకులు ద్విపాత్రాభినయం చేశారు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో అన్నగారు విశ్వామిత్రుడిగా, రావణుడిగా రెండు పాత్రల్లో నటిస్తే.. బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇది కూడా ఇంత వరకు ఈ హీరోకి దక్కని ఘనతే అని చెప్పాలి.

టైం మిషన్ పై వచ్చిన మొదటి తెలుగు చిత్రం

ప్రయోగాలకు ముందుండే బాలయ్య 90లలోనే అనేక ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. అలాంటి చిత్రమే ఆదిత్య 369. టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ‘ఆదిత్య 369’. ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటించారు. ఇక అతి తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయి వినోదాన్ని ఆ సినిమా ప్రేక్షకులకు పంచింది. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘బైరవ ద్వీపం’ అనే జానసద చిత్రం బాలయ్య చేశారు.

15 డ్యూయల్, 1 ట్రిపుల్ రోల్.

బాలకృష్ణ ఇప్పటి వరకు ఏకంగా 15 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ చేశారు. 2012లో వచ్చిన ‘అధినాయకుడు’లో తాతా,తండ్రి,మనవడుగా మూడు పాత్రల్లో బాలయ్య కనిపించారు.

నాగేశ్వరరావుతో బాలయ్య చేసిన సినిమాలు అవే.

టాలీవుడ్ రెండో కన్నుగా భావించే అక్కినేని నాగేశ్వరరావుతో మూడు చిత్రాల్లో బాలకృష్ణ కలిసి నటించారు. ‘భార్యభర్తల అనుబంధం, ‘గాండీవం’, శ్రీరామరాజ్యం’ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

బాలయ్యకు ఇష్టమైన తన చిత్రం

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమర సింహారెడ్డి తాను నటించిన చిత్రాలలో అత్యంత ఇష్టమైనదిగా బాలకృష్ణ చెవుతారు. 1999లో దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఫ్యాక్షన్ సినిమాలలో ట్రెండ్ సెట్టర్ గా వచ్చిన ఆ సినిమా, తరువాత అనేక ఫ్యాక్షన్ సినిమాలకు స్ఫూర్తిగా మారింది.

మూడు సార్లు నంది విజేత

బాలకృష్ణ మొత్తంగా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ‘నరసింహానాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు నంది అవార్డు గెలుచుకున్నారు.

బాలయ్య డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ ఆమె మరణంతో ఆగిపోయింది.

తండ్రి ఎన్టీఆర్ వలె బాలకృష్ణ దర్శకుడిగా కూడా మారాలనుకున్నారు. అందుకోసం ఆయన నర్తనశాల అనే పౌరాణిక చిత్రం ఎంచుకున్నారు. ఆ సినిమాలో ద్రౌపదిగా సౌందర్య చేశారు. షూటింగ్ కూడా మొదలైన తరువాత సౌందర్య ప్రమాదంలో మరణించడంలో ఆ ప్రాజెక్ట్ బాలయ్య ఆపివేశారు.

స్టార్ హీరో అయినా వాటికి దూరం.

బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ యాడ్‌లో నటించలేదు. ఆయన తోటి నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అనేక వ్యాపార ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా ఉన్నారు. అది ఎందుకో బాలయ్యకు నచ్చని అంశం.

సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ కాదు.

బాలయ్య సోషల్ మీడియా అంతగా వాడరు. ఇప్పటి స్టార్స్ అందరూ ఫాలో అయ్యే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లేవు. కేవలం ఫేస్‌బుక్‌ అకౌంట్ మాత్రమే ఉంది. దానిలో కూడా ఆయన ఎటువంటి విషయాలు పంచుకోరు.

నిర్మాత కూడా

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారిన బాలకృష్ణ. అంతకు ముందు ‘సుల్తాన్, బాల గోపాలుడు, ‘అల్లరి పిడుగు, ప్రాణానికి ప్రాణం సినిమాలకు సమర్ఫకుడిగా ఉన్నారు.

త్వరలో వారసుడు వస్తాడట

బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా, అది త్వరలోనే జరనున్నట్లు బాలయ్య ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

అబ్బాయితో మల్టీ స్టారర్

అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని బాలకృష్ణ మనసులో కోరిక బయటపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కోసం నేనెప్పుడూ సిద్దమే అని చెప్పడం జరిగింది. మరి సమీప కాలంలో ఎన్టీఆర్ మరియు బాలయ్యను కలిపి వెండితెరపై చూడవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus