Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • వెంకటేష్ (Hero)
  • శ్రీనిధి శెట్టి (Heroine)
  • నివేదా పేతురాజ్, నారా రోహిత్, సత్య, రఘుబాబు, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు (Cast)
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director)
  • ఎస్ రాధాకృష్ణ(చినబాబు) (Producer)
  • తమన్ (Music)
  • రవిచంద్రన్ (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : అక్టోబర్ 30 2026
  • హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Banner)

విక్టరీ వెంకటేష్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో క్రైమ్ అండ్ డార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ రూపొందిన‌ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన మొదటి సినిమా కావడంతో ఆరంభం నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ కెరీర్‌లో క్లాసిక్ మూవీస్ అయినటువంటి ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి సినిమాల‌కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశారు. వెంక‌టేష్‌లోని కామెడీ టైమింగ్‌ను కొత్త కోణంలో ఈ సినిమాలు ఆవిష్క‌రించారు. ఆ నమ్మకంతోనే ‘ఆదర్శ కుటుంబం కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయ్యాయి. ఆ అంచనాలని ఈ సినిమా అందుకుందా? మాటల మాంత్రికుడు మ‌రోసారి మ్యాజిక్ చేయగలిగాడా? తెలుసుకుందాం…

Aadarsha Kutumbam Review

కథ : చిట్టిబాబు (వెంకటేష్) ఓ బ్యాంక్ ఉద్యోగి. అతని భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారంలో (చిట్టీ పాటలో) రూ.4 లక్షలు పోగొట్టుకుంటుంది. దానివల్ల వాళ్లు అప్పుల పాలవుతారు. వీరి కొడుకు శర్వా గుండెలో రంధ్రం ఉండటంతో సర్జరీ చేయాలని డాక్టర్లు చెబుతారు. దానికి రూ.2 లక్షలు ఖర్చవుతుంది. సరిగ్గా అదే సమయంలో చిట్టిబాబు ఉద్యోగం కూడా పోతుంది. అనుకోకుండా అతనికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో ఓవ‌ర్‌నైట్‌లోనే చిట్టిబాబుతో పాటు అత‌డి ఫ్యామిలీ సిటీలో ఫేమస్ అయిపోతారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ బుజ్జి.. చిట్టిబాబు ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి, వారికి రూ.20 కోట్ల విలువగల ఇల్లు కొనిపిస్తాడు.

మరోవైపు బీహార్‌కు చెందిన చందన్ గ్యాంగ్.. పలు రాష్ట్రాలకు చెందిన పెద్దవాళ్ల ఇళ్లలో పనికి చేరి, సెక్యూరిటీ సిబ్బంది లేని సమయం చూసుకుని ఇంట్లోని వాళ్లందరినీ చంపేసి డబ్బు, బంగారం ఎత్తుకుపోతుంటారు. అలాంటి వాళ్ల దృష్టి తెలంగాణలో ఉన్న చిట్టిబాబు ఇంటిపై పడుతుంది. అతని ఇంట్లో పనికి కుదిరిన చందన్ గ్యాంగ్.. ఒకరోజు ఆ వంద కోట్ల డబ్బు కోసం చిట్టిబాబు ఫ్యామిలీపై ఎటాక్ చేస్తారు. కానీ దానికి ఎదురుతిరిగిన చిట్టిబాబు ఫ్యామిలీ, రివర్స్‌లో ఆ చందన్ గ్యాంగ్ మనుషులను చంపేస్తారు. ఆ తర్వాత వాళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చిపడ్డాయి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఫ్యామిలీ రోల్స్ వెంకటేష్‌కు కొత్త కాదు. అందులోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా ఆయన చాలా సినిమాల్లో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా అన్నప్పుడు.. అనిల్ రావిపూడి సినిమాల స్టైల్‌లో వెంకీ పాత్ర సింపుల్‌గా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు కదా! అందుకే ఈ సినిమాలో వెంకటేష్‌ను రూత్‌లెస్ ఫ్యామిలీ మ్యాన్‌గా ప్రెజెంట్ చేశాడు. ఆడియన్స్‌కి ఇది కొత్తగా అనిపించొచ్చు. చిట్టిబాబు పాత్రలో వెంకీ తన బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్‌లో ఎక్కువగా డూప్ షాట్స్ పెద్ద‌గా వాడలేదు. కాకపోతే వెంకీ కామెడీ టైమింగ్‌ను త్రివిక్రమ్ ఎక్కువగా వాడుకోకపోవడం డిస‌పాయింట్‌గా అనిపిస్తుంది.

శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రలో బాగా చేసింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. కొంత కామెడీ కూడా ట్రై చేసింది. ప్రమోషన్స్‌లో తెగ హడావిడి చేసిన ప్రజ్వల్ పాత్ర సినిమాలో పెద్దగా అలరించదు. కూతురి పాత్రలో యువీనా పర్వాలేదు అనిపించింది. రఘుబాబు తనకు అలవాటైన మేనేజర్/బ్రోకర్ పాత్రకు న్యాయం చేశారు. సత్య కామెడీ సినిమాకే హైలైట్. చాలా సందర్భాల్లో అతనే ఆద‌ర్శ కుటుంబం సినిమాకు సేవియర్ అనిపిస్తాడు. రావు రమేష్ పాత్ర కథను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడింది. నారా రోహిత్ పాత్రకు మొదట్లో బిల్డప్ ఇచ్చి, ఆ తర్వాత సైలెంట్ చేసేశారు. నివేదా పేతురాజ్ పాత్ర కథకు స్పీడ్ బ్రేకర్‌లా మారింది. బీహార్ విలన్ గ్యాంగ్ చూడటానికి పవర్‌ఫుల్‌గా కనిపించి భయపెట్టారు.

సాంకేతిక వర్గం పనితీరు: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ జోనర్‌కు స్టిక్ అయిపోయారు అనే విమర్శలు ఉన్నాయి. అందుకే పాన్ ఇండియా సినిమా తీయలేకపోతున్నారు అనే విమ‌ర్శ‌లు వ్యక్తమయ్యాయి. దాని నుండీ బయటకు వచ్చే ప్రయత్నంలోనే క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ఆదర్శ కుటుంబం’ని తెరకెక్కించారు. ఇది మంచి ఐడియానే. ఆలోచ‌న బాగున్నా ఆచ‌ర‌ణ‌లో త‌డ‌బ‌డ్డారు. ఆయ‌న‌ రేంజ్ స్క్రీన్ ప్లే ఆదర్శ కుటుంబం లో కుదర్లేదు. గ‌త సినిమాల్లో క్రైమ్, కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను చాలా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసిన త్రివిక్రమ్.. ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు.

ఈ సినిమాలో క్రైమ్ ఎక్కువగా ఉంది. కామెడీ లోపించింది. సత్య పాత్రతో కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేసినా.. ఆ పాత్రని అర్ధాంతరంగా ముగించి మళ్ళీ సీరియస్ టోన్ కి షిఫ్ట్ అవ్వడం మైన‌స్‌గా మారింది. తమన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద మైనస్. టైం లేకో ఇంట్రెస్ట్ లేకో కానీ హడావిడి హడావిడిగా కొట్టేసి మమ అనిపించాడు. బడ్జెట్ లోపాలు అయితే లేవు.. అలా అని చెప్పుకునే గొప్ప స్థాయిలో కూడా లేవు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది.

విశ్లేషణ : కొద్దిరోజులుగా ఆదర్శ కుటుంబం సినిమాని పట్టి పీడిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది బ్లాస్ట్ సినిమాతో కంపేరిజన్ అనే చెప్పాలి. ఆ పోలికలు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే బలవంతంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ డోస్ పెంచారు. కానీ అవి మెయిన్ ప్లాట్ కి అది అడ్డుగా మారింది. అనవసరమైన సాగదీతకు కారణం అయ్యింది. సినిమా స్టార్ట్ అయిన మొదటి 15 నిమిషాల తర్వాత డ్రాగ్ అనిపించిన ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్స్ తో తిరిగి ట్రాక్ లో పడింది. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ , యాక్షన్ ఎపిసోడ్స్ బాగా పండాయి. సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్ కూడా బాగుంది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ వద్ద వచ్చే ట్విస్ట్, సత్య కామెడీ అలరిస్తాయి. కానీ మళ్ళీ షాపింగ్ మాల్ ఎపిసోడ్ సాగదీతగా మారింది. ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ లెంగ్త్ అనిపించినా కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆదర్శ కుటుంబం అంచనాలను మ్యాచ్ చేసే స్థాయిలో లేదు. అలా అని తీసి పారేసే స్థాయిలో కూడా లేదు. జీరో అంచనాలతో థియేటర్ కి వెళ్ళే ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించొచ్చు.

ఫోకస్ పాయింట్: అదుపు తప్పిన ఆదర్శ కుటుంబం

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus