సినిమాల్లో అంటే సరదాగా ఎంజాయ్ చేస్తాం కానీ.. నిజంగానే ఎవరైనా మన చెల్లినో, అక్కనో సినిమాలో హీరోయిన్ ని హీరో వెంటాడి ఏడిపించినట్లు, చెయ్యి పట్టుకోవడం, ఇష్టం లేకుండా కౌగిలించుకోవడం లాంటివి చేస్తే చూస్తూ ఉరుకుంటామా చెప్పండి. కుదిరితే నాలుగు కొడతాం, మరీ ఎక్కువ చేస్తే పోలీసులకు అప్పగిస్తాం.
అదే ఒక హీరోయిన్ మనకి కనిపిస్తే మాత్రం అక్కో, చెల్లో అవసరం లేదు కనీసం ఒక ఆడదానిలా ఎందుకు చూడలేకపోతున్నారు. బయట అంటే మృగాలు ఎక్కువయ్యాయి.. సినిమా ఇండస్ట్రీలోనూ హీరోయిన్ అంటే ఎందుకంత లోకువ, హీరోయిన్ అంటే జీవితాంతం హీరోకి గులాంగా ఉండాలా? అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది హైదరాబాదీ కమ్ బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైదరీ. ఆమె నటించిన “భూమీ” చిత్రం ఈవారం విడుదలకానుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన అదితిరావు ఈ విధంగా హీరోయిజం అండ్ ఇండస్ట్రీలో ఆడవాళ్ళను తక్కువగా చూడడం పట్ల నిప్పులు చెరిగింది. మరి ఏదో సందర్భం వచ్చింది కాబట్టి తన మనసులోని మాటల్ని ఇలా బయటపెట్టిందా లేక ఆమెకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలేమైనా ఉన్నాయా? అనేది అదితిరావుకే తెలియాలి.