ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారు… ఆ మాటకొస్తే అందరినీ ప్రభాస్ కూడా అలానే పిలుస్తాడు. ప్రభాస్ మంచి మనసు వల్లే అందరికీ డార్లింగ్‌గా మారాడనేది కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఎవరైనా కొత్తవాళ్లతో ప్రభాస్ ఎలా ఉంటాడు, వెంటనే కలిసిపోతాడా? అనే డౌటానుమానం కచ్చితంగా వచ్చే ఉంటుంది. దీనికి ప్రభాస్ కొత్త హీరోయిన్ కృతి సనన్ సమాధానం చెప్పేసింది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
‘ఆదిపురుష్’లో కృతి నటిస్తోందనే విషయం చెబుతూ ఇటీవల చిత్రబృందం కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దాంతో చాలా రోజుల కథానాయిక విషయంలో ఉన్న పుకార్లకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టేసింది. ప్రభాస్‌తో పని చేయడం గురించి కృతి ఇటీవల చెప్పుకొచ్చింది. తొలిసారి ప్రభాస్‌ను కలిసినప్పుడు ఆయన కాస్త సిగ్గుపడినట్లు అనిపించింది. పెద్దగా మాట్లాడలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి… ఆ తర్వాత చాలా సరదగా మారిపోయారు. మాట్లాడుతూనే ఉండిపోయాం అంటూ ప్రభాస్‌ను కలిసిన తొలి రోజు గురించి చెప్పుకొచ్చింది కృతి.
ఆయన చాలా పెద్ద ఫుడీ. తను తినడమే కాకుండా… తన పక్కన ఉన్నవారికి కూడా చక్కగా వడ్డిస్తాడు అంటూ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పింది కృతి. అంతేకాదు ఈ సినిమాలో తనదైన ముద్ర వేయడానికి కృతి చాలా కష్టపడుతోందట. తెలుగు భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందట. మరోవైపు సీతగా నటించడం అంటే… ఉన్నది ఉన్నట్లు చూపించాలి. ఎటువంటి అతి ఉండకూడదు.. దాని కోసం చాలా కష్టపడుతున్నాం. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాం అని చెప్పింది కృతి.