కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకప్పుడు సినిమా తారలు మాత్రమే హాజరయ్యేవారు. దాంతో వారు ధరించి వచ్చే దుస్తుల విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగేవి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కూడా కాన్స్‌కి హాజరవుతున్నారు. జిగేల్ మనిపించే డ్రెస్‌లతో మెరిపిస్తున్నారు. అలా ఎవరు, ఎంతమంది వచ్చినా మన స్టార్‌లు మాత్రం హైలైట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాయ్ ఒకరు. ఆమె ఏటా ఎలాంటి దుస్తుల్లో వస్తారా అని ఫ్యాన్స్, ఫ్యాషన్ ప్రియులు ఎదురుచూస్తుంటారు.
ఏదో ఒక స్పెషాలిటీతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ నిలిచే ఐశ్వర్య ఈసారి ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ‘లుమినారా’ అనే డీప్ సఫైర్-బ్లూ (నీలి రంగు) గౌన్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచి అదరగొట్టారు. క్రిస్టల్ వీన్ అనే ఎంబ్రాయిడరీ టెక్నిక్‌ను ఉపయోగించి ఆ డ్రెస్‌ను రూపొందించారట. దీనికిగాను దాదాపు 1,500 గంటలకు (62 రోజులు) పైగా హ్యాండ్ వర్క్‌తోనే డిజైన్ చేశారట. కెమెరా ఫ్లాష్ లైట్ పడినప్పుడు గౌన్‌పై లిక్విడ్స్ కదులుతున్నట్లుగా కనిపిస్తాయి.
ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇప్పటి వరకు 24 సార్లు కాన్స్‌కు హాజరయ్యారు. 2002లో ‘దేవదాస్’ సినిమా ప్రీమియర్ కోసం తొలిసారిగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు కాన్స్ వేదికపై తన మెరుస్తూనే ఉంది. ఈసారి ఆమె రాదేమో అని అనుకున్నారంతా. కాన్స్ మొదలై ఇన్ని రోజులైనా ఆమె అక్కడ కనిపించకపోవడమే దానికి కారణం. ఇక ఎప్పటిలాగే ఐశ్వర్య లుక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంలో ఐశ్వర్య రియాక్ట్ అవ్వనప్పటికీ మరో నటి కంగనా రనౌత్ రియాక్ట్ అయింది. ఐశ్వర్య ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసి అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంది. ఫ్యాషన్, స్టైల్ ఎవరికి నచ్చినట్లు వారు ఎంపిక చేసుకునేవి. వారి ఇష్టానికి, సౌకర్యానికి తగినట్లు అవి ఉంటాయి. రెడ్ కార్పెట్‌పై ఎప్పుడూ యువ నటీమణులే ఉండరు. ఇలా 50 ఏళ్లలో ఉన్నవారు కూడా కనిపిస్తారు. వారిని చూడడం అలవాటు లేకపోతే ఇకనైనా అలవాటు చేసుకోండి అని కంగన రాసుకొచ్చింది.