దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా తన సినీ ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టడంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య రాజేష్, తనకు మొదట్లో హీరోయిన్‌గా అవకాశాలు రావడం అంత సులభం కాదని గుర్తు చేసుకున్నారు. “నువ్వు చాలా సాధారణంగా కనిపిస్తున్నావు.. హీరోయిన్ మెటీరియల్ కాదు” అని చాలామంది చెప్పారని, ఆ మాటలు తనను బాధపెట్టినా వెనక్కి తగ్గలేదని చెప్పారు. క్రమంగా మంచి కథలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకున్నానని వివరించారు.
తమిళంలో వచ్చిన ‘క పే రణసింగం’ సినిమా తన కెరీర్‌లో కీలక మలుపు అని ఆమె అన్నారు. అప్పటికి తనాకి కేవలం 22 సంవత్సరాలు వయసులో ఉన్నప్పటికీ ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించడానికి ఎలాంటి సందేహం పడలేదని చెప్పారు. ఆ పాత్రను అంగీకరించడానికి నటుడు విజయ్ సేతుపతి తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, నటనలో కూడా ఎన్నో విలువైన సూచనలు చేశారని ఆమె వెల్లడించారు. ఆ అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
సినిమాల్లో గ్లామర్ కంటే కథకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను ఎంచుకోవడమే తన లక్ష్యమని ఐశ్వర్య చెప్పారు. మహిళా ప్రాధాన్య కథలు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయని, అలాంటి చిత్రాలు పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఓటీటీ వేదికలు రావడంతో కొత్త తరహా కథలకు అవకాశాలు పెరిగాయని, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతున్నాయని తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య రాజేష్ సుపరిచితమే. ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘ సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోవడంలో ఆమె ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. ప్రస్తుతం తమిళం, మలయాళంతో పాటు కన్నడలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్, భాషతో సంబంధం లేకుండా మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. ఓపిక, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వమే తన విజయానికి ప్రధాన కారణమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.