టాలీవుడ్‌లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే, అందులో నటించిన హీరోయిన్ రేంజ్ మారిపోవడం మామూలే. కానీ ఐశ్వర్యా రాజేష్ విషయంలో మాత్రం లెక్కలు రివర్స్ అయ్యాయి. గతేడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ హిట్ తర్వాత తన కెరీర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుందని ఆశించింది. కానీ ఫలితం మాత్రం ఆమె ఊహించినట్టుగా లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన కెరీర్ గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో ఉన్నా, ఇప్పటివరకు ఏ పెద్ద స్టార్ హీరో పక్కన ఆఫర్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ లెక్కలు చాలా వింతగా ఉంటాయని, సక్సెస్ మాత్రమే ఇక్కడ అవకాశాలను డిసైడ్ చేయదని ఆమె అభిప్రాయపడ్డారు. హిట్ వచ్చినా తనను ఎవరూ పెద్ద ప్రాజెక్టుల కోసం సంప్రదించకపోవడంపై ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఐశ్వర్యా రాజేష్ మంచి పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే కమర్షియల్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా ఆమెకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఇండస్ట్రీలోని కొన్ని సమీకరణలే అడ్డుగా నిలుస్తున్నాయనిపిస్తోంది. స్టార్ హీరోల ఆఫర్లు రాకపోయినా, ఆమె మాత్రం తన మార్క్ సినిమాలతో బిజీగానే ఉన్నారు.
ప్రస్తుతం ఈమె తిరువీర్ సరసన ‘ఓ సుకుమారి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆమె చాలా హోప్స్ పెట్టుకున్నారు. స్టార్ డమ్ కోసం పాకులాడకుండా, తనకు తృప్తినిచ్చే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఒక నటిగా తనకు గుర్తింపునిచ్చే సినిమాల్లో భాగమవ్వడమే ముఖ్యమని, ఆఫర్లు రాకపోయినా బాధపడటం లేదని స్పష్టం చేశారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి పెద్ద హిట్ కూడా ఆమె ఫేట్ మార్చలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.