‘’నాకు తెలిసి ఈ ప్రపంచంలో జ్ఞాపకాలు లేని మనిషి ఉండడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జ్ఞాపకాలు. వంశీ గారివైతే “పొలమారిన జ్ఞాపకాలు”. మొట్టమొదటిగా నేను చూసిన వంశీ గారి సినిమా ‘అన్వేషణ’ (TVలో). ఆ సినిమా చూసి అదేంటి ఈయన ఇంతలా భయపెట్టాడు అనుకున్నా. ఆ తరువాత ఆయన సినిమాలు చూస్తుంటే మా ఊర్లో ఉన్న చాలా క్యారక్టర్స్ గుర్తొచ్చేవి. కొన్ని రోజులు తరువాత ఆయన రాసిన మా ‘పసలపూడి కథ’ల దగ్గర నుండి ఇప్పుడు ‘పోలమారిన జ్ఞాపకాలు’ వరకు ఎన్నో కథలు చదివాను. మొదట క్యారెక్టర్స్ ని పరిచయం చేసి , తర్వాత కామెడీ జతచేసి , చివరగా కళ్ళల్లో నీళ్ళు తెప్పించి కథను ముగించడం వంశీ గారి స్టైల్.
మాది గోదావరికి ఆనుకుని ఉన్న ఆత్రేయపురం గ్రామం. కాబట్టి నాకు గోదావరి కొత్తేమి కాదు. నేను వంశీగారి కథలు చదవడానికి ముందు గోదారంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్, బంధువులు వచ్చినప్పుడు చూపించే ఒక ప్రదేశం మాత్రమే. కానీ వంశీ గారి కథలు చదివిన తర్వాత గోదారి మీదున్న నా అభిప్రాయం మొత్తం మారిపోయింది. ఆహా! ఎంతమందిని చూసింది ఈ గోదారి. నేను ఊరెళ్లిన ప్రతిసారి అక్కడికెళ్ళి గట్టు మీద నుంచుని అలా గోదారి వైపు చూడటం అలవాటైపోయింది. అలా ఆ గోదారిని చూస్తున్నంతసేపు వంశీగారు రాసిన కథల్లో ఉన్న క్యారక్టర్లందరూ ఆ ఇసుక తిప్పలో నుండి నా వైపుకి నడుచుకోస్తున్నట్టు ఉంటాయి. అంతలా గుర్తుండిపోయాయి నాకు అన్ని క్యారెక్టర్స్. ఒక్కోసారి అడగాలి అనిపిస్తుంది “దేవుడా నన్ను ఒక నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి, ఆ కల్మషం లేని క్యారెక్టర్స్ మధ్య పడేయ్” అని. అంతలా ప్రభావితం చేశాయి నన్ను వంశీగారి కథలు. ముఖ్యంగా ఈ “పొలమారిన జ్ఞాపకాలు’.
నేను ఖచ్చితంగా చెప్పగలను, భారత దేశంలో ఏ డైరెక్టర్ శైలినైనా (taking) ఫాలో అయిన వాళ్ళు ఉన్నారేమో కానీ, ఇద్దరు డైరెక్టర్ల శైలిని (taking) మాత్రం ఫాలో అయిన అయిన వారు లేరు, అవ్వలేరు కూడా. వాళ్ళిద్దరూ ఎవరంటే ఒకటి ‘బాపు’ గారు, రెండు ‘వంశీ’గారు. ఎన్నో కథలు, ఇంకెన్నో క్యారెక్టర్లు….. వాటిని సృష్టించిన వంశీ గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. – అజయ్ భూపతి