బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘టైసన్ నాయుడు’(Tyson Naidu) అనే సినిమా సెట్స్ పైకి వెళ్ళి చాలా కాలం అయ్యింది.’14 రీల్స్ ప్లస్’ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇందుకు నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ ప్రచారం జరిగింది. ’14 రీల్స్ ప్లస్’ సంస్థ నిర్మించిన నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా రిలీజ్ విషయంలో ఎంతటి గందరగోళం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా కూడా నిర్మాణ సంస్థపై ఆర్థిక ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.
అయితే ఆ సమస్యలను అధిగమించి ‘అఖండ 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే సినిమాపై ఉన్న హైప్ సైడ్ ట్రాక్ అవ్వడంతో.. సినిమాకి నష్టాలు భారీగా వచ్చాయి. ఆ ఎఫెక్ట్ ‘ టైసన్ నాయుడు’ పై గట్టిగానే పడింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయట.కానీ డిజిటల్ హక్కుల డీల్ ఇంకా పూర్తికాలేదు. మేకర్స్ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా పెట్టుబడిలో ప్రధాన భాగాన్ని రికవరీ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నాన్-థియేట్రికల్ డీల్స్ పూర్తయి ఆర్థికపరమైన అడ్డంకులు తొలగితే ‘టైసన్ నాయుడు’ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే ఏడాది పాటు ఆలస్యమైన ఈ సినిమాకు 2026 దసరా తర్వాత విడుదల తేదీని నిర్ణయించనున్నారని అంటున్నారు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మరోవైపు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కర్నూలు పరిసర ప్రాంతాలలో ‘హైందవ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ‘టైసన్ నాయుడు’కు సంబంధించిన ఆర్థిక, డిజిటల్ డీల్స్ త్వరగా పూర్తయితే 2026లోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అధికారిక విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.