‘వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడి ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు ఆయన చూపించిన అసహనం, దాన్ని హనుమంతుడి నమ్మకంతో ముడిపెట్టడంపై పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ టీమ్ వదిలిన లేటెస్ట్ పోస్టర్స్ కొత్త చర్చకు తెరలేపాయి. జక్కన్న కామెంట్స్ కు కౌంటర్ గానే హనుమాన్ సెంటిమెంట్ ను బయటకు తీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
AKHANDA 2
నిజానికి ‘అఖండ’ మొదటి భాగం మొత్తం శివుడి చుట్టూ, అఘోరా బ్యాక్ డ్రాప్ లో నడిచింది. సీక్వెల్ కూడా అదే శివ తత్త్వంతో ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రిలీజ్ టీజర్ లో, తాజాగా వచ్చిన సెన్సార్ పోస్టర్ లో హనుమంతుడి విగ్రహాన్ని భారీగా హైలైట్ చేశారు. రీసెంట్ గా రాజమౌళి హనుమంతుడిని ప్రశ్నించిన సమయంలోనే, బోయపాటి ఇలా హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ పోస్టర్ వదలడం యాదృచ్ఛికం అనిపించడం లేదన్నది సోషల్ మీడియా టాక్.
బాలకృష్ణకు దైవభక్తి, హిందుత్వం అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానం చెప్పడానికే, ఈ టైమ్ లో హనుమాన్ ఫ్యాక్టర్ ను తెరపైకి తెచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవైపు జక్కన్న మాటలపై రాజాసింగ్, మాధవి లత వంటి వారు ఫైర్ అవుతుంటే, బాలయ్య తన సినిమా ద్వారా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. దీన్ని కేవలం కౌంటర్ గానే చూడలేం. ఒకవేళ కథలో అఘోరా పాత్రకు, హనుమంతుడికి మధ్య బలమైన లింక్ ఉండి ఉంటే ఈ ప్రమోషన్ కరెక్టే అవుతుంది. అలా కాకుండా, కేవలం ఇప్పుడు నడుస్తున్న వివాదానికి కౌంటర్ గా హనుమాన్ ను వాడితే మాత్రం అది మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. కథలో ఆ ఎమోషన్ ఉంటేనే ఈ పోస్టర్లకు న్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా, రాజమౌళి వర్సెస్ అఖండ అనే టాపిక్ ఇప్పుడు సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది. ఇది ఉద్దేశపూర్వక కౌంటరా? లేక స్క్రిప్ట్ డిమాండా? అనేది డిసెంబర్ 5న సినిమా చూస్తే గానీ తెలియదు.