బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా.. చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది. కొన్ని రోజుల్లో అలియా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. అయితే ఈ సినిమాలో అలియాతో నటింపజేయడంతో పాటు ఓ పాట కూడా పాడించాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడట. ఈ సినిమాలో అలియా భట్, రామ్ చరణ్ పై ఓ పాట ఉంది.
దీన్ని అలియాతో పాడించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అలియాకి పాటలు పాడడం కొత్తేమీ కాదు. గతంలో ‘హైవే’, ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’ వంటి చిత్రాలలో ఆమె పాటలు పాడింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి తన సినిమా కోసం అలియాతో పాట పాడించనున్నారు. అయితే తెలుగు, తమిళ భాషల పదాలను ఉచ్చరించడం కష్టం కాబట్టి.. ఆ రెండు భాషల్లో వేరే వాళ్లతో పాడించి.. హిందీ వెర్షన్ మాత్రం అలియాతో పాడించాలని అనుకుంటున్నారట.
సినిమా షూటింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 2నుండి అలియా షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ సినిమా కోసం ఆమె కొంతవరకు తెలుగు నేర్చుకున్నారు. తెలుగు భాషలో ప్రత్యేకంగా పాఠాలు చెప్పించుకున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.