అతిలోక సుందరి అంటూ ఇప్పటికీ, ఎప్పటికీ పిలుచుకునే స్థాయి ఉన్న కథానాయిక ఎవరైనా ఉన్నారా అంటే అది కచ్చితంగా శ్రీదేవినే. ఈ మాట విషయంలో ఎవరూ ఎలాంటి డౌట్స్ రెయిజ్ చేయరు. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఆ స్థాయి రాజసం, ఆ స్థాయి గ్రేస్, ఆ స్థాయి అందం, ఆ స్థాయి స్క్రీన్ ప్రజెన్స్ ఇంకెవరికీ రావు. శ్రీదేవి అంటే ఇవేనా? అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆమె కెరీర్‌లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని అందరికీ తెలిసి ఉంటే.. ఇంకొన్ని కొందరికే తెలుసు.
ఇపుడు, ఆమె జీవితం గురించి.. జీవిత చరిత్ర గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె జీవిత చరిత్ర రెడీ అయింది కాబట్టి. గురువారం శ్రీదేవి జయంతి సందర్భంగా ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేసింది. ధీరజ్ యు కుమార్ రాసిన ‘ఎంప్రెస్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ పుస్తకం ముఖ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీదేవి జీవితం గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలుస్తోంది.
హీరోలకు దీటుగా తమదైన ముద్రవేసిన హీరోయిన్స్ మన ఇండియన్ సినిమాలో ఎవరూ లేరా అనే ప్రశ్నలు వస్తున్న సమయంలో శ్రీదేవి సినిమాల్లోకి వచ్చి.. స్టార్ అయ్యారు. 90వ దశకంలో రూ.కోటి పారితోషికం తీసుకునే హీరోయిన్ శ్రీదేవినే అని చెప్పొచ్చు. అప్పట్లో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే రూ.కోటి ఆపై పారితోషికం అందుకునే వారు. అప్పటికి బాలీవుడ్‌లో ముగ్గురు ఖాన్‌లకు కూడా అంత ఇవ్వలేదు. కానీ శ్రీదేవికి ఇచ్చారు.
ఇప్పుడు ప్రశ్న ఈ పుస్తకాన్ని సినిమాగా తీస్తే.. అందులో శ్రీదేవి పాత్రను ఎవరు పోషిస్తున్నారు అని. అలాగే ఈ సినిమాలో శ్రీదేవి జీవితంలో ఎత్తు పళ్లాలను చూపిస్తారా అనేది ప్రశ్న.