హీరోల స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ప్రయోగాలు చేయాలి అంటుంటారు మన సినిమా పెద్దలు. అయితే ఆ ప్రయోగాలు నేలవిడిచి సాము చేయకూడదని మాట కూడా చెబుతారు. దీనిని కొంతమంది హీరోలు చక్కగా అర్థం చేసుకొని విజయం సాధించి ముందుకెళ్తుంటారు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడట అల్లు అర్జున్. హీరోగా ఓ లెవల్లో ఉన్న బన్నీ… తన తర్వాతి సినిమాలో కాస్త విలనిజం చూపిండానికి రెడీ అవుతున్నాడట. అల్లు అర్జున్ తర్వాతి సినిమా అంటే…
ఇంకేముంది ‘పుష్ప’నే. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెలిసిందే. స్మగ్లింగ్ అంటే చట్టవ్యతిరేక చర్చ. ఆ పని చేస్తున్నాడంటే అతనిలో నెగిటివ్ షేడ్ ఉంటుంది. ఆఁ… అదే ఇక్కడ ప్రయోగం. ‘పుష్ప’లో అల్లు అర్జున్ పాత్రలో కాస్త ప్రతినాయక ఛాయలు కనిపిస్తాయని టాక్. దీనికి సంబంధించి పాత్ర చిత్రణను సుకుమార్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. తెలుగులో ఇలా హీరోలుగా ఉండి కాస్త విలనిజం చూపించిన వాళ్లు చాలామంది ఉన్నారు.
అయితే అవేవీ సరైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో విలనిజం చూపించడం రిస్కే కదా. అయితే సుకుమార్ సినిమాల్లో ఏ పాత్ర అయినా… ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానే ఉంటుంది. కాబట్టి ‘పుష్ప’రాజ్ విషయంలో ప్రేక్షకులు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాం.