టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ లెవల్లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప 2 తర్వాత ఆయన రేంజ్ కంప్లీట్ గా మారిపోవడంతో, తర్వాతి ప్రాజెక్టుల విషయంలో బన్నీ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 2027 ఏడాది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. ఒకే ఏడాదిలో ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాలు థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలాగే ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఆ ప్రాజెక్టులు ఉండబోతున్నాయట.
ప్రస్తుతం బన్నీ, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి తన 22వ సినిమా (AA22) పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది ఒక హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని, ఇందులో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్. హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, 2027 ప్రథమార్ధంలో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ (AA23) పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇటీవలే భోగి పండుగ సందర్భంగా ఈ క్రేజీ కాంబోను అధికారికంగా ప్రకటించారు. లోకేష్ సాధారణంగా తన సినిమాలను చాలా స్పీడ్ గా షూట్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ 2026 ద్వితీయార్ధంలో మొదలయ్యే అవకాశం ఉంది. లోకేష్ స్పీడ్ అండ్ వర్కింగ్ స్టైల్ చూస్తుంటే, అట్లీ సినిమా వచ్చిన కొద్ది నెలల గ్యాప్‌లోనే అంటే 2027 చివర్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా బాక్సాఫీస్ వద్దకు వచ్చే ఛాన్స్ ఉంది.
అల్లు అర్జున్ వరుసగా తమిళ దర్శకులకు అవకాశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అట్లీ సినిమా కోసం సుమారు 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇందులో దీపికా పదుకోన్ తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక లోకేష్ ప్రాజెక్టుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతున్నాయి. పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న బన్నీ, ఒకవేళ 2027 లో ఈ రెండు సినిమాలు గనుక రిలీజ్ చేస్తే టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం.