అల్లు అర్జున్ (Allu Arjun) అంటే మలయాళ సినిమా ఫ్యాన్స్‌కి ఎందుకో చాలా అభిమానం. ఆయన సినిమాలు డబ్బింగ్ చేసుకునే, ఓటీటీల్లో వస్తేనో తెగ చూసేవారు. ఆ తర్వాత మన సినిమాల్ని నేరుగా అక్కడ రిలీజ్ చేసినప్పుడు కూడా చూశారు. అలా అల్లు అర్జున్ (Allu Arjun) ను మల్లు అర్జున్‌ను చేశారు. అక్కడ ఇప్పటికీ బన్నీని అలానే పిలుస్తారు. ఇప్పుడు ‘పుష్ప’ (Pushpa) సినిమాల తర్వాత ఈ ఫీవర్ ఎక్కువైంది. ఆ ప్రేమకు కృతజ్ఞతగా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమాలో ‘పీలింగ్స్’ పాట ప్రారంభంలో మలయాళం లిరిక్స్ పెట్టి వావ్ అనిపించాడు.
ఇప్పుడు, ఆ ప్రేమ ఇంకా ఎక్కువైంది అనేమో.. ఏకంగా మలయాళ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే నేరుగా కాదు కానీ.. అక్కడి దర్శకుడితో సినిమా చేస్తాడట. అక్కడి దర్శకుడు తెరకెక్కించే సినిమా కాబట్టి కచ్చితంగా మలయాళంలో కూడా తెరకెక్కించి రిలీజ్ చేస్తారు అని చెప్పొచ్చు. సినిమా కథ కూడా అక్కడి ఫ్లేవర్‌లోనే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్ చేస్తారట.మామూలుగా అయితే ఈ ప్రాజెక్ట్ లైన్‌లోకి రావడానికి చాలా సమయం పట్టేది. అట్లీ సినిమా, త్రివిక్రమ్ (Trivikram) సినిమాలు అయ్యాకే ఈ సినిమా చేయాల్సి వచ్చేది. కానీ ముందుగా అనుకున్న సినిమాను త్రివిక్రమ్ (Trivikram) వద్దనుకున్నారో లేక అల్లు అర్జున్ వద్దనుకున్నారో కానీ.. ఆ ప్రాజెక్ట్ తిరిగి ఎన్టీఆర్ (Jr.NTR) దగ్గరకు వెళ్లిపోయింది.
దీంతో అట్లీ సినిమా తర్వాత బన్నీకి ఇంకా కొత్త సినిమా ఏమీ లేదు. ఆ ప్లేస్‌లో బసిల్ జోసెఫ్ (Basil Joseph) ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట. బసిల్ జోసెఫ్ మనకు నేరుగా పరిచయం లేకపోయినా కొన్నేళ్ల క్రితం ‘మిన్నల్ మురళి’ (Minnal Murali) అనే సినిమా తీశారు. ఆ సినిమా ఓటీటీలో మన వాళ్లు చాలామంది చూసి ఆదరించారు కూడా.