పాపం సూర్య హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన ”సికందర్” సూపర్ ఫ్లాప్ అవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్ల కెరీర్ లో దాదాపు రెండేళ్లు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది బాబుకి. ఆ సినిమా గనుక ఫ్లాప్ అవ్వకపోయి ఉంటే అల్లు అర్జున్ అర్జున్ తో ప్లాన్ చేసిన తమిళ-తెలుగు బైలింగువల్ మాత్రం తప్పకుండా ఈపాటికి మొదలవ్వాడమో లేక రిలీజ్ అవ్వడమో జరిగిపోయి ఉండేది. కానీ.. సినిమా ఫ్లాప్ అవ్వడం, లింగుస్వామి మాస్ పల్స్ మీద అల్లు అరవింద్ తోపాటు అల్లు అర్జున్ కూడా సందేహం వ్యక్తం చేయడంతో.. లాంఛనంగా ప్రారంభమైన సినిమా ఇప్పటివరకూ సెట్స్ కు వెళ్లలేదు.
అల్లు అర్జున్ ఎంతకీ లింగుస్వామి రాసిన కథను ఓకే చేయకపోవడంతో.. విశాల్ తో ఎప్పుడో మూడేళ్ళ ముందు ఒప్పుకొన్న “పందెం కోడి 2″ను సెట్స్ మీదకు తీసుకొచ్చేశాడు. అల్లు అర్జున్ కూడా ఎలాగూ వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” మొదలెట్టాడు. ఈ సినిమా పూర్తయ్యి విడుదలయ్యేసరికి కనీసం మార్చి లేదా ఏప్రిల్ అయిపోతుంది. ఆ తర్వాత లింగుస్వామి-అల్లు అర్జున్ ల బైలింగువల్ మొదలవుతుందని సమాచారం. గీతా ఆర్ట్స్-స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం లింగుస్వామి శైలి మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందనుంది.