మధ్య తరగతి ఇంట్లో ఓ పెళ్లి అంటే లక్షల ఖర్చు అని అంటుంటారు. ఎంత తక్కువలో చేద్దాం అనుకున్నా లక్షలు దాటిపోతాయి. అదే లక్షాధికారులు, కోటీశ్వరుల ఇళ్లలో పెళ్లి అంటే ఆ లెక్క ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ఇదంతా సగటు వ్యక్తుల గురించే.. అదే సినిమా జనాలకైతే.. ఆ ఖర్చు కోట్లలో ఉంటుంది అంటారు. భారీ స్థాయిలో పెళ్లి… వరుస రిసెప్షన్లు పెట్టి భారీగా ఖర్చు పెడుతుంటారు. కొంతమంది అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారు. అయితే లక్షన్నరకే ఓ హీరోయిన్ పెళ్లి అయిపోయింది అంటే నమ్ముతారా?
వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా… ఇది జరిగింది. ఈ విషయాన్ని (Amrita Rao) ఆమెనే చెప్పుకొచ్చింది. తెలుగులో ‘అతిథి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమృతా రావు గురించే ఇదంతా. ఆమె 2006లో ఆర్జే అన్మోల్ను వివాహం చేసుకుంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆమె వారి వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే.. అమృత పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది కూడా. పుణెలోని ఇస్కాన్ టెంపుల్లో ఈ పెళ్లి జరిగింది.
దగ్గరి బంధువులు, కొంతమంది మిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని అమృతా రావు. పెళ్లి కోసం కేవలం రూ.1.5 లక్షల మాత్రమే ఖర్చు పెట్టినట్లు చెప్పింది. పెళ్లి బట్టలు, కల్యాణ వేదిక, ప్రయాణ ఖర్చులు… ఇలా అన్నీ ఆ డబ్బులోనే అయిపోయాయట. డిజైనర్ దుస్తులు కాకుండా, సంప్రదాయ దుస్తులతోనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన అమృత… వాటి కోసం రూ. 30 వేలు ఖర్చు చేసినట్లు చెప్పింది.
పెళ్లి వేదిక కోసం రూ. 11 వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పింది. అలా మొత్తంగా తమ పెళ్లి ఖర్చు లక్షన్నర రూపాయలకుకు మించలేదని చెప్పింది. పెళ్లి… ఎప్పుడూ ప్రేమతో నిండిపోవాలి కానీ… డబ్బు, హంగు, అర్భాటాలతో కాదనే ఆలోచన తమతో అలా చేయించింది అని చెప్పుకొచ్చింది అమృత. అలాగే దగ్గరి బంధువులు, కొందరు స్నేహితులను మాత్రమే తమ వివాహానికి ఆహ్వానించామని అమృత వివరించింది.