వరుస పరాజయాలతో అటు హీరోగా, ఇటు నటుడిగా నిలదొక్కుకోవడానికి తెగ ఇబ్బందిపడుతున్న సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించగా.. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అన్నీ మంచి శకునములే”. “సీతారామం”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్వప్న సినిమాస్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: తాతల ఆస్తుల గొడవల కారణంగా పక్కపక్కనుంటూనే మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే కుటుంబ పెద్దలు ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) & సుధాకర్ (నరేష్). తల్లిదండ్రులు పడే గొడవలతో సంబంధం లేని స్నేహం రిషి (సంతోష్ శోభన్) & ఆర్య (మాళవిక నాయర్)లది. పెద్దల పంతం.. పిల్లల ప్రేమ నడుమ సాగే ఉల్లాసభరిత ఫ్యామిలీ డ్రామా “అన్నీ మంచి శకునములే”.
నటీనటుల పనితీరు: నటుడిగా సంతోష్ శోభన్ హుందాగా కనబడే పాత్రల్లో జీవించేస్తాడు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోతున్నాడు. ఈ చిత్రంలో రిషి పాత్రకు చాలా వెయిటేజ్ ఉంది. కానీ.. ఆ వెయిట్ ను పాత్రలో ఎలివేట్ చేయలేకపోయాడు సంతోష్ శోభన్. ముఖ్యంగా.. ఫస్టాఫ్ లో చాలా ఇబ్బందిపడ్డాడు. సెకండాఫ్ లో మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు.
మాళవిక నాయర్ పాత్రకు పెద్దగా వేరియేషన్స్ లేవు కాబట్టి.. సినిమా మొదలైనప్పట్నుంచి చివరి వరకూ ఒక మూడ్ మైంటైన్ చేసింది. ఎమోషన్స్ ను కళ్ళతో పలికించడానికి ప్రయత్నించి పర్వాలేదనిపించుకుంది.
రాజేంద్రప్రసాద్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి తదితరులు తమ సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్స్ కొన్ని ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకురాలు నందినిరెడ్డి తన రెగ్యులర్ ఫార్మాట్ కు కాస్త భిన్నంగా.. ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం కోసం తయారు చేసుకుంది. ఆ ప్రపంచమే “విక్టోరియాపురం”. ఆ పేరును జస్టిఫై చేయడం కోసం నందినిరెడ్డి బాగానే కష్టపడింది. కానీ.. కథనం విషయంలో మాత్రం ఎందుకో తన మార్క్ వేయలేకపోయింది. “అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే” చిత్రాల్లో నందిని రెడ్డి మార్క్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది.
కానీ.. (Anni Manchi Sakunamule) “అన్నీ మంచి శకునములే”లో అది మిస్ అయ్యింది. అందువల్ల.. సినిమా అలా సాగుతూనే ఉంటుంది కానీ.. కథలో, కథనంలో లేదా పాత్రల్లో ప్రేక్షకులు లీనమవ్వలేరు. కాకపోతే.. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానంలో మాత్రం నందిని రెడ్డి మార్క్ కనిపించింది. కథ, కాంబినేషన్ తో సంబంధం లేకుండా.. బ్యానర్ వేల్యూని ఏమాత్రం తగ్గనివ్వకుండా నిర్మాతలు పెట్టిన ఖర్చును మాత్రం మెచ్చుకోవాలి. మిక్కీ జె.మేయర్ నేపధ్య సంగీతం & పాటలు కూడా బాగున్నాయి. సన్నీ & రిచర్డ్ ద్వయం సమకూర్చిన సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది.
విశ్లేషణ: ఒక ఫ్యామిలీ డ్రామాకు భీభత్సమైన కథనం, ట్విస్టులు అక్కర్లేదు కానీ.. కనీస స్థాయి మూమెంటం ఉండాలి. లేదంటే మాత్రం ఆడియన్స్ కు బోర్ కొట్టి ఇబ్బందిపడాల్సి వస్తుంది. “అన్నీ మంచి శకునములే” విషయంలో జరిగింది అదే.. అద్భుతమైన క్యాస్టింగ్, అత్యద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, వినసోంపైన సంగీతం ఉన్నప్పటికీ.. ఆకట్టుకోవాల్సిన కథనం లోపించడంతో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.