సుమంత్ (Sumanth) స్టార్ హీరో కాకపోవచ్చు కానీ.. సుమంత్ ఫిల్మోగ్రఫీలో ఉన్నన్ని “రిపీట్ వాచ్ వెల్యూ” సినిమాలు అతని జనరేషన్ హీరోల్లో మరెవరికీ లేవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమధ్య స్పీడ్ తగ్గించి అప్పుడప్పుడూ సినిమాలు తీస్తున్న సుమంత్ నటించిన తాజా చిత్రం “అనగనగా” (Anaganaga). ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ మంచి ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది, మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: వ్యాస్ (సుమంత్) ప్రస్తుత తరం విద్యా వ్యవస్థ అంతగా నచ్చనివాడు. చదువు పిల్లలపై రుద్దకూడదు, వాళ్ల మెదళ్ళల్లో నిక్షిప్తమయ్యేలా ఆహ్లాదంగా చెప్పాలి అని నమ్మేవాడు. అయితే.. వ్యాస్ చెప్పే విధానం మంచిదే అయినా, అతని పద్ధతులు అందరికీ రుచించవు. అందుకే చాలా స్కూల్స్ నుంచి తీసివేయబడతాడు. వ్యాస్ విధానాల్ని అవలంబించుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటాడు అతని కొడుకు రామ్ (విహర్ష్ యాదవల్లి). కానీ.. సొంత తల్లి కూడా ఆ పద్ధతుల్ని ఇష్టపడడు. పైపెచ్చు “ఫెయిల్యూర్” బ్యాడ్జ్ తగిలించి స్కూల్ స్టేజ్ మీద నిలబెడుతుంది.
అలాంటి సందర్భంలో కొడుకుతోపాటు ఫెయిల్యూర్స్ గా స్టేజ్ మీద నిలబడిన పిల్లల మానసిక స్థితిని వ్యాస్ ఎలా మార్చాడు? వాళ్లని సక్సెస్ ఫుల్ స్టూడెంట్స్ గా ఎలా నిలబెట్టాడు? అనేది “అనగనగా” కథాంశం.
నటీనటుల పనితీరు: మాస్ రోల్స్ లో ఫైట్స్ చేయమంటే కాస్త ఇబ్బందిపడతాడేమో కానీ.. క్లాస్ రోల్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో పాత్రను పండించమంటే మాత్రం సుమంత్ ని మించిన నటుడు లేడు. సమాజానికి అవసరమైన ఓ ఉపాధ్యాయుడిగా అతడి పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ఆ పాత్రలో సుమంత్ జీవించిన తీరుకి ఎంతలా కనెక్ట్ అవుతామంటే.. వ్యాస్ పాత్రతో ట్రావెల్ చేసేంతలా. ఆ పాత్ర యొక్క ప్రతి ఎమోషన్ ను మనం ఫీల్ అవుతాం, అతడు చెప్పే ప్రతి కథలోని భావాన్ని మన జీవితానికి రిలేట్ చేసుకుంటాం. ఇంతకుమించి ఏ నటుడు కూడా ప్రేక్షకుడిని పాత్రలో లీనం చేయలేడు. సుమంత్ కి మాత్రమే సాధ్యమైన ఓ అరుదైన విషయమిది.
కాజల్ చౌదరి ఓ బిహారీ అమ్మాయి అనే విషయం ఆమె గురించి వెతికితే తప్ప తెలియలేదు. పదహారణాల తెలుగమ్మాయిలా అంతలా ఒదిగిపోయింది పాత్రలో. రెండు వైవిధ్య భావాలను పలికించడంలో మంచి నేర్పు ప్రదర్శించింది. అక్కడక్కడా కాస్త లిప్ సింక్ మిస్ అయ్యింది తప్పితే.. నటిగా ఎక్కడా చిన్న తప్పు కూడా దొర్లనివ్వలేదు.
రామ్ అనే పాత్రలో మాస్టర్ విహర్ష్ యాదవల్లి జీవించేసాడు. “తారే జమీన్ పర్” చిత్రంలోని ఇషాన్ అవస్థి పాత్ర కొద్దిగా గుర్తు చేసినప్పటికీ.. ఎమోషనల్ సీన్ లో చక్కని నటనతో ఆకట్టుకున్నాడు.
రాకేష్ రాచకొండకు చాలారోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. అంతే బాధ్యతతో బరువైన పాత్రను చక్కగా పోషించాడు.
శ్రీనివాస్ అవసరాలది (Srinivas Avasarala) ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ కాదు కానీ.. ప్రస్తుత విద్యావ్యవస్థకు అద్దం పట్టే పాత్ర. విలన్ లా కనిపిస్తాడు కానీ విలన్ కాదు. అలాంటి పాత్రను సెన్సిబుల్ గా క్యారీ చేశాడు శ్రీనివాస్ అవసరాల.
మిగతా పిల్లల పాత్రలు, వారి నటన కూడా చాలా సహజంగా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు: పవన్ కుమార్ పప్పుల (Pavan Kumar Pappula) సినిమాటోగ్రఫీ వర్క్ “అనగనగా” చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. చాలా లిమిటెడ్ బడ్జెట్ & రీసోర్సెస్ తో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే.. ఎమోషన్ కి తగ్గట్లుగా బ్రైట్ నెస్ & టింట్ ను డి.ఐ & కలరింగ్ లో బ్యాలెన్స్ చేసిన తీరు మంచి అనుభూతినిస్తుంది.
చందు రవి నేపథ్య సంగీతం హృద్యంగా ఉంది. అక్కడక్కగా గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి కాస్త ఇబ్బంది వినిపించినా.. ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో మాత్రం విజయం సాధించాడు.
దర్శకుడు సన్నీ సంజయ్ (Sunny Sanjay) పనితనం గురించి మాట్లాడుకోవాలి.. విద్యావ్యవస్థ నేపథ్యంలో చిన్నపిల్లల సినిమా అనగానే “తారే జమీన్ పర్, పసంగ-2, సార్” లాంటి సినిమాలు కచ్చితంగా గుర్తుకొస్తాయి. వాటిని తలపించినా పర్లేదు కానీ, సేమ్ అలానే ఉంది అనే భావన మాత్రం ప్రేక్షకులకి కలగకుండా “అనగనగా” చిత్రాన్ని తెరకెక్కించాలనే పెద్ద బాధ్యత సన్నీ మీద ఉంది. ఆ బాధ్యతను చాలా అద్భుతంగా నిర్వర్తించాడనే చెప్పాలి. ముందుగా ఈ కథ మొత్తాన్ని తండ్రీకొడుకుల మధ్య సాగే ఓ సింపుల్ ఎమోషనల్ స్టోరీగా ఎలివేట్ చేసినప్పుడే సగం విజయం సాధించాడు. అలాగే.. ఈ తరహా సినిమాల్లో ప్రశ్నలు లేవనెత్తడం చాలా సులభం కానీ.. వాటికి సమాధానం చెప్పడం చాలా కష్టం.
“తారే జమీన్ పర్, పసంగ-2, 3 ఇడియట్స్” లాంటి సినిమాల్లో పూర్తిస్థాయి సమాధానం ఉండదు. కానీ.. సన్నీ “అనగనగా” చిత్రం ద్వారా చదువు కనీసం 7వ తరగతి వరకు కథల రూపంలో ఆసక్తికరంగా చెప్తే పిల్లల మీద ప్రెజర్ పడకుండా, ప్రతి అంశాన్ని బుర్రకెక్కించుకుంటారు అనే లాజికల్ ఆన్సర్ ఇచ్చిన విధానం హర్షణీయం. ఎమోషన్ & సొల్యూషన్ కాంబినేషన్ చాలా రేర్ కానీ “అనగనగా” చిత్రంలో ఆది చక్కగా కుదిరింది. సో, దర్శకుడిగా సన్నీ సంజయ్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడనే చెప్పాలి.
విశ్లేషణ: “అనగనగా” ఓ మంచి సినిమా. పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల చదువుకొనే విధానాన్ని ఎలా మెరుగుపరచాలి వంటి విషయాలని ఏదో బలవంతపు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ఇచ్చినట్లుగా కాకుండా హృద్యంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. చిన్నపాటి మైనస్ పాయింట్స్ ఉన్నా.. సుమంత్ మార్క్ క్లాస్ పెర్ఫార్మెన్స్, సన్నీ సంజయ్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేసిన తీరు, ఎక్కడా ఎమోషన్ ను ఆతృతగా కాకుండా అర్థవంతంగా, ఆర్గానిక్ గా మేళవించిన విధానం కోసం “అనగనగా” చిత్రాన్ని ఈటీవీ విన్ యాప్ లో కుటుంబ సభ్యులందరూ కలిసి కచ్చితంగా చూడాలి.
ఫోకస్ పాయింట్: అనగనగా ఓ మంచి సినిమా!
రేటింగ్: 3/5