Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్ దేవరకొండ
- September 10, 2026 / 01:42 PM ISTByFilmy Focus Desk
ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో ఆదిత్య హాసన్ రూపొందించిన చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఈ సినిమాను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆనంద్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేనొక బాధ్యతాయుతమైన వ్యక్తిని, నటుణ్ని. అందుకు తగ్గట్టే నేను చేసే సినిమాలు ఉంటాయి. మంచి ఉద్దేశంతో మనం పని చేస్తున్నప్పుడు వేరొకరి అభిప్రాయాల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆనంద్.
Anand Deverakonda
నిజ జీవితాల్లో జరిగే సంఘటనల్ని… మనమే అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందీ సినిమా. ప్రేమ, కుటుంబం, భయాలు, బాధ్యతలు… ఇలా జీవితాల్లో ఏమేం ఉంటాయో అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అందుకే హీరో, విలన్ కాంబినేషన్ సినిమాలు కాకుండా ఒక అందమైన ప్రయాణంలా ఈ సినిమాను సిద్ధం చేశాం. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా, కుటుంబానికి దూరంగా ఉండేవాళ్లకూ ఈ కథ తమని తాము చూసుకునేలా ఉంటుంది అని చెప్పాడు ఆనంద్.

ఈ సినిమాలో సహజీవనం నేపథ్యం ఉన్నా, కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా దర్శకుడు ఆదిత్య బాధ్యతాయుతంగా ఈ సినిమాను సిద్ధం చేశారు అని చెప్పాడు. ఈ కథ వింటున్నప్పుడు ‘నా కథలాగే ఉంది’ అనిపించిందట ఆనంద్‌కి. తాను అమెరికాలో చదువుకున్నానని.. ఈ సినిమా కథ లండన్‌లో జరుగుతుంది. ఇందులో కథానాయకుడు ఒక అమ్మాయితో సహజీవనం చేస్తాడు. నా జీవితంలో అది జరగలేదు. ఆ ఒక్కటి తప్ప దాదాపు నా జీవితంలో జరిగిందే తెరపై కనిపిస్తుంది అని ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు.
నెక్స్ట్ సినిమాల సంగతి చూస్తే.. ‘తక్షకుడు’ అనే సినిమా త్వరలో రాబోతోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ సినిమాలో ఆనంద్ అంధుడిగా కనిపిస్తాడు. దాంతోపాటు ఇండో కొరియన్ నేపథ్యంలో సాగే మరొక సినిమా చేశానని చెప్పాడు. అయితే అవెప్పుడు వస్తాయో చూడాలి.













