ఫ్యానిజం.. వెండితెర మీద హీరోకు, వెండితెర బయట ఫ్యాన్‌కు మధ్య ఉండే ఒక ఎమోషనల్ బాండ్. దీనిపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ చూస్తే ఇదేదో కొంచెం కొత్తగా ట్రై చేసినట్లు అనిపిస్తోంది. హీరో రామ్ పోతినేని ఒక వీరాభిమానిగా, సీనియర్ నటుడు ఉపేంద్ర సూపర్ స్టార్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. “ఒక అభిమాని బయోపిక్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ఒక ఫ్యాన్ లైఫ్‌ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు.
Andhra King Taluka
ట్రైలర్ విషయానికి వస్తే, హీరో కోసం చొక్కాలు చించుకోవడం, బ్యానర్లు కట్టడం, టికెట్ల కోసం కొట్టుకోవడం.. ఇవన్నీ ఒక సగటు అభిమాని జీవితంలో భాగమే. అయితే, ఈ అభిమానం హద్దులు దాటితే ఏమవుతుందనే పాయింట్‌ను దర్శకుడు మహేష్ ఇందులో టచ్ చేసినట్లు కనిపిస్తోంది. హీరో సూర్య (ఉపేంద్ర) కోసం సాగర్ (రామ్) చేసే హడావిడి, కుటుంబంతో వచ్చే గొడవలు, ప్రేమకథ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ను మిక్స్ చేసి ట్రైలర్‌ను కట్ చేశారు.
రామ్ పోతినేని మరోసారి తన ఎనర్జీతో సాగర్ పాత్రలో ఒదిగిపోయాడు. చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ, ఒక మాస్ ఫ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక సూపర్ స్టార్‌గా ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయి. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే, హీరోకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, ఇతర నటీనటులు తమ పాత్రల్లో సహజంగా కనిపించారు.
మ్యూజిక్ పరంగా వివేక్ మెర్విన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. కొన్ని షాట్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ విజువల్స్ బాగున్నాయి. “జీవితం అంటే సినిమా కాదురా, బయటకొచ్చి చూడు..” అనే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అయితే, కథలో కొత్తదనం ఎంతవరకు ఉందనేది సినిమా చూస్తే గానీ తెలియదు. కేవలం ఫ్యానిజం పేరుతో రొటీన్ కమర్షియల్ డ్రామా చూపించారా, లేక నిజంగానే ఎమోషనల్ కనెక్ట్ ఉందా అనేది ఆసక్తికరం.
మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే, ఇది ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతోంది. హీరో అంటే పడి చచ్చే అభిమానులకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నవంబర్ 27న థియేటర్లలో ఈ “ఆంధ్ర కింగ్” అభిమానులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.