తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తెలుగులో తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతమందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్. సినిమా రిలీజ్ కానంతవరకు అనిరుధ్ పై అందరూ అభినందనలు కురిపించారు. అందుకే త్రివిక్రమ్ తాను ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాకి కూడా అతన్నే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ కాగానే.. సీన్ మొత్తం రివర్స్ అయింది. అనిరుధ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. సెంటిమెంట్ పరంగా త్రివిక్రమ్, అనిరుధ్ జోడీ సెట్ కాదని తేల్చేశారు. దీంతో అనిరుధ్ ని తొలగించి థమన్ కి అవకాశమిచ్చారు.
ఇది అనిరుధ్ కి తప్పకుండా కోపం తెప్పించి ఉంటుందని అనుకున్నారు. ఏదో రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడని మీడియా ఎదురుచూసింది. కానీ అనిరుధ్ పాజిటివ్ గా స్పందించి షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ 28 నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని వారు ట్విట్టర్ అకౌంట్ లో తమ సినిమా టీమ్ వీరే అంటూ పోస్ట్ చేయగా.. అందుకు అనిరుధ్ నిన్న రీట్వీట్ చేశారు. గురూజీ త్రివిక్రమ్ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ఎన్టీఆర్, థమన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రీ ట్వీట్ తో తనకు త్రివిక్రమ్ పై ఎటువంటి కోపం లేదని అర్ధమవుతోంది.