NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
- November 15, 2026 / 12:29 AM ISTByPhani Kumar
సినీ పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. ఎవరు సక్సెస్ లో ఉంటే.. వాళ్ళని అందనం ఎక్కించడం, ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళని కిందకి లాగేయడం ఇండస్ట్రీ జనాలకి అలవాటే. అసలు విషయంలోకి వెళితే.. ఈరోజు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. అది కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో..! స్వయంగా ఎన్టీఆర్(NTRxAnilRavipudi).. ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించాడు. ‘లాఫ్ రియోట్’ అంటూ సినిమా జోనర్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు.
NTRxAnilRavipudi

కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మంచి విషయమే కదా.. మరి స్టార్టింగ్లో ఎందుకు అలా అన్నట్టు? అనే డౌట్ ఎవ్వరికైనా రావొచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. తర్వాత త్రివిక్రమ్ తో ఓ మైథలాజికల్ సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది అని ప్రచారం జరిగింది.
అయితే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిజల్ట్ అనుకున్నట్టు రాలేదు. కమర్షియల్ గా ఆ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. ‘గుంటూరు కారం’ సో సోగా ఆడినా.. ‘ఆదర్శ కుటుంబం’ డిజాస్టర్ లిస్టులో చేరిపోవడంతో త్రివిక్రమ్ గ్రాఫ్ తగ్గిందని అంతా భావిస్తున్నారు. త్రివిక్రమ్ కెరీర్లో వరుసగా ఇలా 2 సినిమాలు డిజప్పాయింట్ చేసిన సందర్భాలు లేవు. ఇదిలా ఉంటే.. 2 రోజుల క్రితం త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.
దీంతో లైన్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఆన్లైన్లోకి వచ్చి ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలిసున్న ఓ ఫోటోని షేర్ చేసి.. అది అబద్దం అన్నట్టు స్పందించారు. కానీ ఈరోజు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అయినట్టు అధికారిక ప్రకటన రావడంతో.. మళ్ళీ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుపై సందేహాలు నెలకొన్నాయి.
















