టాలీవుడ్ ప్రస్తుతం ఎక్కువ మాట్లాడుతున్న సినిమా ‘పెద్ది’ కాగా.. ఎక్కువమంది మాట్లాడుతున్న మ్యూజిక్ డైరక్టర్ ఏ.ఆర్.రెహ్మాన్. ఆ సినిమాకు ఆయన సంగీతం అందించడంతో ఆయన పేరు ఎక్కువగా మారుమోగుతూ ఉంది. అయితే ఆయన గురించి, ఆయన పనితనం గురించి ప్రపంచ సినిమా మరోసారి మాట్లాడే రోజు వచ్చేస్తోంది. అదే ‘రామాయణ’. బాలీవుడ్‌లో సుమారు రూ.4000 కోట్ల అతి భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రెండు పార్టుల సినిమా ఇది. ఈ సినిమా గురించి రెహ్మాన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా చేశారు.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సీతగా సాయిపల్లవి నటిస్తున్న సినిమా ‘రామాయణ’. ఈ సినిమాలో రావణుడిగా యశ్ నటిస్తున్నాడు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటుందని సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటున్నారు. దానికి కారణం ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ అని చెబుతున్నారు. ఆయనతో కలిసి రెహ్మాన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
‘రామాయణ’ నా కెరీర్‌లోనే అతిపెద్ద సినిమాల్లో ఒకటి. కథ పరంగానే కాకుండా, అన్నివిధాలా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాకు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని రెహ్మాన్ ధీమా వ్యక్తం చేశారు. సినిమా ట్రైలర్‌ను త్రీడీలో చూశానని, అద్భుతంగా ఉందని చెప్పారు రెహ్మాన్. ఇలాంటి సినిమాను మన దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఇంతవరకు చూడలేదని చెప్పారు. సినిమా త్రీడీ విజువల్స్, సంగీతం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పారు.
హన్స్ జిమ్మర్‌తో తనది గొప్ప స్నేహమని చెప్పిన రెహ్మాన్.. మన దేశానికి, సంస్కృతికి సంబంధించిన గొప్ప చిత్రానికి ఇద్దరం కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. హన్స్ జిమ్మర్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడం అంటే ఆయన్ను ప్రపంచ వేదికలపై రాయబారిలా నిలబెట్టడమే అని చెప్పారు. ఆయన వల్ల విదేశీయులు కూడా ఈ సినిమాను చూస్తారని చెప్పారు. ఇక ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది