తెలుగులో వెబ్ సిరీస్ ల హవా మొదలయ్యాక రిలీజైన “అర్థమయ్యిందా అరుణ్ కుమార్”(Arthamainda Arun Kumar Season 2 Review) అనే సిరీస్ సాఫ్ట్వేర్ ఆడియన్స్ ను ఆకట్టుకుని “ఆహా” యాప్ కి మంచి సబ్ స్క్రిప్షన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ సిరీస్ సెకండ్ సీజన్ విడుదలైంది. మొదటి సీజన్ లో టైటిల్ పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డిని సెకండ్ సీజన్ లో సిద్ధు పవన్ రీప్లేస్ చేయగా, మొదటి సీజన్ దర్శకుడు జొనతన్ ను సెకండ్ సీజన్ కు ఆదిత్య కెవి రీప్లేస్ చేశారు. ఈ కొత్త సీజన్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!
కథ: ఇంటర్న్ నుండి మేనేజర్ స్థాయికి ఎదిగిన ముందా అర్జున్ కుమార్ (సిద్ధు పవన్) తన కొత్త జాబ్ ను నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడతుంటాడు. తన ఎక్స్ బాస్ శాలిని (తేజస్వీ మడవాడ) డామినేషన్ తట్టుకుంటూ.. తనపై కోపం పెంచుకున్న ప్రేయసి పల్లవి (అనన్య శర్మ)ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ.. తన కొత్త ఇంటర్న్ సోనియా (సిరి రాశి) తెగులు పట్టిన తెలుగును భరిస్తూ ఎలా నిలదుక్కుకున్నాడు? అనేది “అర్థమయ్యిందా అరుణ్ కుమార్” సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2 Review) కథాంశం.
నటీనటుల పనితీరు: అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న నటి అనన్య శర్మ. మొదటి సీజన్ లో తన చురుకుదనాన్ని ప్రదర్శించిన అమ్మడు, రెండో సీజన్ కి అప్డేట్ అయ్యి మొక్కవోని కార్యదక్షతను చూపింది. అనన్య నటిగా ఒకే సన్నివేశంలో రెండు వైవిధ్యమైన ఎమోషన్స్ ను చూపించి తన సత్తా చాటుకుంది.
టైటిల్ పాత్ర అయిన అరుణ్ కుమార్ గా ఒదగడానికి సిద్ధు పవన్ కు కాస్త సమయం పట్టింది. అతడిలో అమాయకత్వానికి అందరూ కనెక్ట్ అవుతారు. అయితే.. అతడు తిరిగి ఫైట్ చేస్తూ నిలదొక్కుకున్న విధానాన్ని ఇంకాస్త చక్కగా చూపించే బాగుండేది అనిపిస్తుంది.
తేజస్వీ మడివాడ అందరికంటే సీనియర్ కావడం, ఆమెను నటిగా ఛాలెంజ్ చేసే సీన్స్ లేకపోవడంతో ఆమె గ్లామర్ తో మ్యానేజ్ చేసింది. ఇక తెలుగు రాని ఎన్నారైగా సిరి రాశి నవ్వించే ప్రయత్నం చేసింది. అక్కడక్కడా పర్వాలేదు కానీ ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య కెవి ఇదివరకు తెరకెక్కించిన “అన్ హెర్డ్” అనే సిరీస్ చాలా బాగుంటుంది. సిరీస్ మొత్తాన్ని కేవలం సంభాషణలతో ఆకట్టుకునేలా తెరకెక్కించిన అతడి ప్రతిభకు చాలా మంచి పేరు వచ్చింది. అయితే.. “అర్థమయ్యిందా అరుణ్ కుమార్” తరహా కంటెంట్ అతడి జోన్ కాదు అని సిరీస్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఎక్కడా నవ్యత కనిపించదు. ఆల్రెడీ పలు సినిమాల్లో, హిందీ వెబ్ సిరీసుల్లో చూసిన సన్నివేశాలే కనిపించాయి. దర్శకుడిగా తన రెండో ప్రయత్నంతో మాత్రం అలరించలేకపోయాడు.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ గట్రాలు సోసోగా ఉండగా.. అజయ్ అరసాడ సంగీతం మాత్రం బాగుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ సిరీస్ కు మంచి ప్లస్ పాయింట్.
విశ్లేషణ: తెలుగులో ఓ సిరీస్ కి సెకండ్ సీజన్ రావడం అనేది చాలా అరుదు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో “అర్థమయ్యిందా అరుణ్ కుమార్” ఫెయిల్ అయ్యింది. కంటెంట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. రైటింగ్ & కామెడీ సరిగా వర్కవుట్ అవ్వకపోవడంతో ఈ సీజన్ ఆడియన్స్ ను అలరిచలేకపోయింది.
ఫోకస్ పాయింట్: మరీ ఎక్కువ సాగిందయ్యా అరుణ్ కుమార్!
రేటింగ్: 2/5