ఆగస్టు నెల పై టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే జూలై 31న రిలీజ్ అయిన ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తుంది అని అంతా ఆశించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆ సినిమా అద్భుతాలు చేయలేదు. తర్వాత ‘అతడు’ రీ రిలీజ్ అయ్యింది. కొంతలో కొంత ఆ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూసిన ఆగస్టు 14 కూడా ఒక రకంగా నిరాశపరిచింది అనే చెప్పాలి.
ఈ డేట్ కి ఎన్టీఆర్ – హృతిక్ రోషన్..ల ‘వార్ 2’ రిలీజ్ అయ్యింది. అలాగే రజినీకాంత్ – నాగార్జున..ల ‘కూలీ’ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.
ఈ 2 సినిమాలతో టాలీవుడ్ కి పూర్వ వైభవం వస్తుంది అని డిస్ట్రిబ్యూటర్లు కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అలాంటిదేమీ జరగకపోవడం బాధాకరం అనే చెప్పాలి.
ఇక చిన్న సినిమాలు అయితే వారానికి 5,10 చొప్పున వచ్చాయి కానీ ఏ ఒక్కటీ కూడా నిలబడలేదు. ‘థాంక్యూ డియర్’ ‘బకాసుర రెస్టారెంట్’ ‘బాలు గాడి లవ్ స్టోరీ’ ‘భలే సిత్రం’ ‘మాతృ’ ‘రాజు గాని సవాల్’ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ ‘పరదా’ ‘యూనివర్సిటీ’ ‘కన్యాకుమారి’ ‘స్పృహ : ది బ్లాక్ ఔట్’ ‘సుందరకాండ’ ‘అర్జున్ చక్రవర్తి’ ‘త్రిభాణదారి బార్బరిక్’ ‘బ్రహ్మాండ’ ‘యూనివర్సిటీ’ వంటి సినిమాలు అలాగే చిన్న చితక సినిమాలు అన్నీ కలుపుకుని 60 వరకు రిలీజ్ అయ్యాయి. కానీ అందులో ఏ ఒక్కటీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడింది లేదు. చివర్లో ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ అనే డబ్బింగ్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది.