బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ చిత్రాలకు ఆజ్యం పోసిన చిత్రం “హంటర్”. సెక్స్ ఎడిక్ట్ అయిన ఓ యువకుడి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందిన తెలుగులో తెరకెక్కిన సినిమా “బాబు బాగా బిజీ”. అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఓ మేరకు ఆకట్టుకోగా సినిమా ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ : మాధవ్(అవసరాల శ్రీనివాస్) తన టీనేజ్ లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం.. తన అవసరం తీరిపోగానే మరో అమ్మాయి వెంట పడడం ఇదే మాధవ్ జీవనశైలి. సెక్స్ కు తప్ప తన జీవితంలో మరొక దానికి ప్రాధాన్యం ఇవ్వని మాధవ్ కొన్నేళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో తన జీవితంలోకి రాధ(మిస్టీ చక్రవర్తి) అనే అమ్మాయి వస్తుంది. రాధను, మాధవ్ ఇష్టపడతాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. దానికి రాధ కూడా కొంత సమయం తీసుకొని ఓకే చెబుతుంది. అయితే తనొక సెక్స్ అడిక్ట్ అనే విషయాన్ని మాత్రం మాధవ్, రాధకు చెప్పడు. ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగిన తరువాత మాధవ్ తన గతం గురించి రాధకు చెప్పాలనుకుంటాడు. నిశ్చితార్ధం అనంతరం మాధవ్-రాధల జీవితంలో చోటు చేసుకొన్న పరిణామాలేటువంటివి? రాధకు తన గురించిన నిజాన్ని మాధవ్ చెప్పాడా లేదా? అనేది కీలకాంశం..!!
నటీనటుల పనితీరు : అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి పెద్ద మైనస్. ఓ సెక్స్ ఎడిక్ట్ కు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం అవసరాల నటనలో కనిపించదు. ఒరిజినల్ వెర్షన్ లో టైటిల్ పాత్ర పోషించిన గుల్షన్ దేవయ్య సదరు పాత్రకు వివిధ వేరియేషన్స్ తో ప్రాణం పోయగా.. అవసరాల మాత్రం ఏదో అయ్యిందనిపించాడు. మిస్తీ నటన బాగుంది. సినిమా మొత్తంలో క్యారెక్టరైజేషన్ తోపాటు క్లారిటీ ఉన్న పాత్ర మిస్తీదే. తేజస్వి మడివాడ గ్లామర్ డోస్ తో అలరించడానికి ప్రయత్నం చేసినప్పటీకీ.. ఆమె పాత్రకు సరైన వివరణ లేక ఆమె అందాల ఆరబోత సినిమాకు అక్కరుకు రాలేదు. ఇక “ఆంటీ” క్యారెక్టర్ లో సుప్రియా ఐసోలా మరీ వయసు ముదిరిన మహిళగా కనిపించడం, ఆమెతో శ్రీనివాస్ అవసరాలకు ఉన్న రొమాన్స్ ఎపిసోడ్ కూడా రోమాంచితంగా కాక వెగటుగా ఉండడం గమనార్హం. ఇక “పెళ్ళిచూపులు” ఫేమ్ ప్రియదర్శి నటుడిగా మరోమారు ఫెయిల్ అయ్యాడు.
సాంకేతికవర్గం పనితీరు : సినిమాలోని ఎమోషన్ ను తన సంగీతంతో ప్రేక్షకులకి చేరువయ్యేలా చేయాల్సిన సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్.. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల మైండ్ ను డైవెర్ట్ చేశాడు. సన్నివేశానికి సంబంధం లేకుండా సునీల్ వాయించిన విధానానికి ప్రేక్షకుడి బుర్ర బొప్పి కట్టడం ఖాయం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డి.ఐ, సౌండ్ మిక్స్ లాంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమాకి మైనస్ లే అని చెప్పాలి. నిర్మాణ విలువలు ఇందుకు ముఖ్యకారణం. తక్కువ బడ్జెట్ లో సినిమాని ముగించేయాలనుకోవడం టెక్నీషియన్లనే కాదు ప్రేక్షకులనూ ఇబ్బందిపెట్టింది.
ఇక దర్శకత్వం విషయానికి వస్తే.. అడల్ట్ కంటెంట్ కావడంతో “హంటర్” సినిమాని తెలుగులో ఉన్నడిఉన్నట్లుగా తీయడం కష్టం. తీస్తే సెన్సార్ బోర్డ్ ఒప్పుకోదు కూడా.. అలాంటప్పుడు దర్శకుడు తన సృజనాత్మకతకు పనిచెప్పి వీలైనంత తక్కువ రొమాన్స్ సీన్లతో కథనాన్ని నడిపించాలి కానీ.. ఆ సీన్లు తప్ప సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసేయడం ఎంతవరకూ కరక్ట్ అనేది దర్శకుడికే తెలియాలి. అసలు హంటర్ హిట్ అవ్వడానికి ముఖ్యకారణమైన “పర్సనాలిటీ స్టడీ” తెలుగు రీమేక్ లో మిస్ అయ్యింది. అసలు హీరో “సెక్స్ ఎడిక్ట్”గా ఎందుకు మారాడు?, అతడు అమ్మాయిల్ని ఎలా వశపరుచుకొనేవాడు, తన కోరిక తీర్చుకొన్నాక వారిని ఏ విధంగా దూరం చేసేవాడు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఏవో సన్నివేశాలు అల్లుకుంటూపోయాడు. అసలు చాలా సెన్సిబుల్ యాక్టర్ అనే పేరు ఉన్న అవసరాలను టైటిల్ పాత్రకు ఎన్నుకోవడం సినిమాకి పెద్ద మైనస్. మరి ఇన్ని మైనస్ లు ఉన్నప్పుడు చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రం ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి.
విశ్లేషణ : హిందీ ఒరిజినల్ వెర్షన్ చూసి.. అదే స్థాయి రోమాంచితమైన సన్నివేశాలు తెలుగులోనూ చూసి సంతోషిద్దాం అనుకోని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల ఆశల మీద నీళ్ళు జల్లిన చిత్రం “బాబు బాగా బిజీ”. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న లాజిక్, సెన్స్, హ్యూమర్ ఇసుమంతైనా లేని “బాబు బాగా బిజీ” చిత్రాన్ని టికెట్ కొని థియేటర్ లో చూడడం కంటే.. ఒరిజినల్ వెర్షన్ “హంటర్”ను యూట్యూబ్ లో చూడడం చాలా బెటర్.
రేటింగ్ : 1.5/5