నటసింహం నందమూరి బాలకృష్ణ కధానాయకుడిగా రూపొందుతున్నఅఖండ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నారు మేకర్స్. దీంతో ఈ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ముంబైలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఘనంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘అఖండ తాండవం’ అంటూ సాగిన ఈ పవర్‌ఫుల్ సాంగ్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మరి కొంత మంది “భం అఖండ” కి కొనసాగింపులా బాగుంది అని అంటున్నారు.
ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు బాలకృష్ణ సహా మొత్తం టీం హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య… “అఖండ 2” హిందూ సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ అనే భావాలను మరింత బలంగా చూపిస్తుందని చెప్పారు.
‘అఖండ తాండవం’ అంటే నిజం కోసం నిలబడటం, అన్యాయానికి తలవంచకపోవటం, ధర్మంతో జీవించడం అనే భావానికే ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. పాట అద్భుతంగా వచ్చిందని, సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తీసుకెళ్లి తప్పకుండా చూపించాలని, వాటి ద్వారా పిల్లలకు హిందూ ధర్మం గురించిన విలువలు తెలుస్తాయని తెలిపారు.
ఇక దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన బంధాన్ని ప్రస్తావించిన బాలయ్య… తమ ఇద్దరిదీ ఒకటే వేవ్‌లెంగ్త్ అని, కలిసి ఇప్పటికే నాలుగు సినిమాలు చేశారు అని గుర్తుచేసుకున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ… “50 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే పదం నా డిక్షనరీలో లేదు” అని, నిజాలు మాట్లాడుతూ ధర్మంగా బతకడం మాత్రమే తనకి తెలుసని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.