ఇప్పుడున్న స్టార్ హీరోల కంటే సీనియర్ స్టార్ హీరోలే జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్స్ తో పోలిస్తే.. వీళ్ళ మార్కెట్ కొంచెం తక్కువే అయినప్పటికీ.. బయ్యర్స్, నిర్మాతలకి సీనియర్లే పెద్ద దిక్కుగా మారారని చెప్పాలి. ఎందుకంటే సీనియర్స్ తో సినిమాలు సెట్ అవ్వాలే కానీ.. వాళ్ళు గ్యాప్ లేకుండా పనిచేసి సినిమాని పూర్తిచేయడానికి ముందుంటున్నారు.
వాళ్ళ మార్కెట్ కి తగినట్టు బిజినెస్ కూడా జరుగుతుంది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్ళు వస్తున్నాయి. వీళ్ళు నాన్ స్టాప్ గా సినిమాలు చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకి ధైర్యం వస్తుంది.. థియేటర్లకి ఫీడింగ్ దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి బాలయ్యనే(Nandamuri Balakrishna) తీసుకుందాం. గతేడాది ‘డాకు మహారాజ్’ ‘అఖండ 2’ సినిమాలతో వచ్చాడు. 2 కూడా బాగానే ఆడాయి.
ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దానిని ఆగస్టుకి కంప్లీట్ చేసి దసరా కానుకగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అది 2027 సంక్రాంతికే రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక వెంకీ(Venkatesh Daggubati) విషయానికి వస్తే.. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఈ ఏడాది చిరుతో పాటు ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో నటించి ఆ సినిమా సక్సెస్ లో భాగం అయ్యాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నాడు. అది దసరాకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది 2027 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా వెంకీ- బాలయ్య దసరా, సంక్రాంతి పండుగలకి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు.