వివాదాలు అనే ఇటుకలపై నిర్మించిన ఇల్లు బిగ్ బాస్ హౌస్. ఈ షో ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది. వాటన్నిటినీ దాటుకొని రెండో సీజన్ కి వచ్చింది. తమిళంలో ‘బిగ్‌బాస్’ సీజన్ 2 రియాల్టీ షో ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్ హాసన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో షూటింగ్‌ను ఆపాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) డిమాండ్ చేసింది. షో కోసం పనిచేస్తున్న టెక్నీషియన్లలో 75 శాతం మంది ముంబయి నుంచి వచ్చిన వారు కావడంతో.. అది తమ నియమాలకు విరుద్ధమని చెప్పింది.
ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి అంగముత్తు షణ్ముగం మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్’ కోసం పనిచేస్తున్న వారిలో 75 శాతం మంది ముంబయి నుంచి వచ్చిన వారేనని మాకు తెలిసింది. ఇది ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధం. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. తర్వాత కమల్ హాసన్‌తో మాట్లాడి.. 50 శాతం మందిని మా సంఘం నుంచి టెక్నీషియన్లుగా పంపించాం” అని అన్నారు. ముంబయి వారిని తొలగించి తమ సంఘం నుంచి సభ్యుల్ని తీసుకోకపోతే శనివారం నుంచి షూటింగ్ జరగనివ్వమని షణ్ముగం హెచ్చరించారు. కమల్ హాసన్ తన ప్రతిభతో, మాటల చాతుర్యంతో షో ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. షో బాగా హిట్ అయింది. ఈ సమయంలో ఈ సమస్య రావడం నిర్వాహకులకు తలపోటు అయింది. మరి దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.