సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం నటుడిగా, దర్శకుడిగా తన కళా తృష్ణ తీర్చుకొనే ప్రయత్నంలో మున్నాకాశి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సి 202”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల్ని పలరించే ప్రయత్నం చేసింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: తక్కువ రేటులో వచ్చిన ఓ బడా విల్లాకి ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగుతాడు డాక్టర్ సుధ (శుభలేఖ సుధాకర్). ఆ ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజులకే పెద్ద కుమార్తె డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సి రావడంతో తనకు బాగా పరిచయస్తుడైన అయాన్ (మున్నాకాశి)ని ఇద్దరు కూతుళ్లకు కాపలా పెట్టి వెళతాడు సుధ. అయితే.. రెండో అమ్మాయి రియా (షారోన్ రియా ఫెర్నాండెజ్) ఇంట్లోకి వచ్చినప్పట్నుంచి కాస్త వింతగా ప్రవర్తించడం మొదలెడుతుంది. రెండుముసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది.
అసలు “సి202” విల్లా సుధాకర్ & ఫ్యామిలీకి ఎందుకంత చీప్ గా దొరికింది? రియా ఎందుకని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది? దీనంతటికీ కారణం ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
నటీనటుల పనితీరు: షారోన్ ఫెర్నాండెజ్ “రియా” పాత్రలో నటించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అయితే.. ఆమె భయపడినా, భయపెట్టినా ఆ ముఖంలో ఎక్స్ ప్రెషన్ మాత్రం కనిపించలేదు. మున్నాకాశి అక్కడక్కడా పర్వాలేదనిపించుకున్నాడు. కాకపోతే.. డైరెక్టర్, మ్యూజిషియన్, ఎడిటర్ కూడా అతడే కావడంతో ఏ టెక్నికాలిటీ మీద దృష్టి సారించాలో తెలియక తికమకపడి ఏ ఒక్క డిపార్ట్మెంట్ లోనూ తన బలాన్ని నిరూపించుకోలేక చతికిలపడ్డాడు.
తనికెళ్ళభరణికి డైలాగ్స్ లేకపోయినా తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోగా.. శుభలేఖ సుధాకర్, చిత్రం శ్రీను, సెల్వరాజ్, సత్య ప్రకాష్, షఫీ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాకు కీలకమైన కథ, కథనం, కూర్పు, సంగీతం, దర్శకత్వం వంటి బాధ్యతలన్నీ మున్నాకాశి భుజాన వేసుకొని హీరోగా కూడా నటించేశాడు. మరీ ఎక్కువ బాధ్యతలు తల మీద వేసుకోవడం వల్ల అన్నిటికీ న్యాయం చేయలేకపోయాడు. కెమెరా వర్క్ చాలా పేలవంగా ఉంది. జంప్ స్కేర్ షాట్స్ తో భయపెడదాం అని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
ఇక ఎస్.ఎఫ్.ఎక్స్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ లొకేషన్ పట్టుకున్నందుకు మాత్రం ప్రొడక్షన్ టీమ్ ను మెచ్చుకోవాలి.
విశ్లేషణ: హారర్ సినిమాను తక్కువ బడ్జెట్ లో తీయడం తప్పేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఆర్జీవీ, మిస్కిన్ లాంటి దర్శకులు కూడా అతి తక్కువ బడ్జెట్ లో చాలా రియలిస్టిక్ హారర్ సినిమాలు తీశారు. కానీ మున్నాకాశి కథ కంటే కథనం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని గ్రాఫిక్స్ మీద దృష్టి సారించకపోవడం కారణంగా కథలో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆకట్టుకునే కథనం లేక “సి202” ఓ యావరేజ్ హారర్ సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: చిన్న బడ్జెట్ లో తెరకెక్కించిన డీసెంట్ హారర్ ఫిలిం.
రేటింగ్: 2/5