దుబాయ్ సుందరి కేథరిన్ యువ నటుడు వరుణ్ సందేశ్ “చమ్మక్ చల్లో” చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది. వెంటనే అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించి అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత పైసా, ఎర్రబస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. మళ్ళీ స్టైలిష్ స్టార్ తో సరైనోడు ఫిల్మ్ లో ఎంఎల్ఏ గా కనిపించి ఆకట్టుకుంది. బన్నీ తో ఉన్న పరిచయంతో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 లో ఐటెం సాంగ్ ఛాన్స్ కూడా పట్టేసింది. కానీ ఆమె దురుసు ప్రవర్తనతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. చిరు కూతురు సుస్మితతో ఆమె హార్ష్ గా మాట్లాడిన విషయం చిత్ర పరిశ్రమ మొత్తం పాకింది.
ఒక్కొక్కరుగా ఆమె పొగరుబోతు తనం గురించి చెప్పడం ప్రారంభించారు. సెట్స్ లో ఆమె ఎన్నో సార్లు తోటి నటులతో, టెక్నీషియన్లతో కోపంగా మాట్లాడిందని ఫిల్మ్ మేకర్స్ వివరించారు. సినిమా ఫంక్షన్స్ కు ఆమె సమయానికి రాదని, ఆమెతో షోలు ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్లు తమ ఇబ్బందిని చెప్పుకున్నారు. దీంతో కేథరిన్ ను సెలక్ట్ చేసుకోవడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఆమెను కంట్రోల్ చేసే పవర్, ఓపిక మాకు లేదని ప్రముఖ దర్శకులు సైతం వాపోతున్నారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమ ఆమెను దూరంగా పెట్టింది. ఇతర భాషల పరిశ్రమలోనూ ఇలాగే ప్రవర్తిస్తే కేథరిన్ నటనకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని సినీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.