ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జన నాయగన్’. సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు పడుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ లోపు ఎవరో సినిమాను లీక్ చేశారు. సినిమా ఎడిట్ కాపీ, విత్ మార్కింగ్ టెక్స్ట్ సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపిస్తునర్నాయి. పూర్తి సినిమా కూడా కొంతమంది దగ్గ ఉంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు, సినిమా టీమ్‌కు మద్దతుగా సినిమా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
తమిళనాడు శివగంగై జిల్లాలో కారైక్కుడిలో ఎన్నికల ప్రచారం తర్వాత చెన్నై చేరుకున్న క్రమంలో ఈ విషయంలో విజయ్‌ను విలేకరులు అడగ్గా.. ఆయన మౌనంగా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇతరుల స్పందనలు చూస్తే.. సినిమా లీక్ కావడం ఆందోళనకు గురి చేసిందని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఆందోళన వ్యక్తంచేశారు. సెన్సార్ జాప్యం వల్లే సినిమా లీక్ అయిందని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కళపై, కళాకారుడి పైన చేసే దాడిగా అభివర్ణించారు.
సినిమా లీక్ అయిందని తెలిసి షాక్ అయ్యాను. చాలా బాధగా ఉంది. దీనికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. సినిమా లీక్ అయితే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా లీక్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వరుణ్ తేజ్ అన్నాడు. ఆ కంటెంట్‌ను షేర్ చేయొద్దని నెటిజన్‌లకు విజ్ఞప్తి చేశాడు.
యావత్ చలన చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన సిగ్గుమాలిన చర్య ఇదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. లీక్ చేయడం అనైతిక చర్య అన్నాడు కార్తి. ‘జన నాయగన్’ లీక్‌తో నా మనసు ముక్కలైంది. సినిమాని కిల్ చేసే వారిపై దయ చూపకూడదని మంచు విష్ణు అన్నాడు. ఇది క్షమించరాని చర్య. సోషల్ మీడియాలో లీక్ గురించి చర్చలు వద్దు అని సూర్య విజ్ఞప్తి చేశాడు. ఎంతోమంది ప్యాషన్, కష్టంతో సినిమా రూపొందుతుంది. పైరసీని ప్రోత్సహించొద్దు అని శివకార్తికేయన్ కోరాడు.