ఈ వారం కూడా పదుల సంఖ్యలో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటిలో కాస్తో కూస్తో జనాల దృష్టిని ఆకర్షించిన సినిమాలు చాలా తక్కువ. అందులో ‘చే’ అనే మూవీ కూడా ఒకటి అని చెప్పాలి.చరిత్రలో గొప్ప వ్యక్తిగా చేగువేరా జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందిన సినిమా ఇది. చేగువేరా గురించి చాలా మంది గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ ఆయన జీవితాన్ని ఇప్పటివరకు వెండితెరపై ఆవిష్కరించేందుకు ఏ దర్శకుడు ప్రయత్నించలేదు. కానీ మొదటిసారి చేగువేరా బయోపిక్ గా ఈ ‘చే’ అనే చిన్న సినిమా రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: అర్జెంటీనాలో జన్మించిన చేగువేరా అలియాస్ చే(బి.ఆర్ సభావత్ నాయక్).. రెండేళ్లకే ఆస్తమా భారిన పడతాడు. దీంతో తనలా ఎవ్వరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో కష్టపడి చదివి… పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని నిశ్చయించుకుంటాడు. తాను అనుకున్నట్టే మెడిసిన్ కంప్లీట్ చేస్తాడు. అయితే కుష్టి రోగంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వాలనే సంకల్పంతో తన స్నేహితుడిని తీసుకుని బైక్ పైనే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాడు.
ఈ క్రమంలో అమెరికా ఆధిపత్యానికి బానిసలుగా బ్రతుకుతున్న క్యూబా పేద ప్రజలను చూసి జాలిపడతాడు. మరోపక్క తమ దేశం కోసం తిరుగుబాటు చేస్తున్న విప్లవకారులకు వైద్యం చేస్తూ వారు ప్రాణాలు విడిచిన తీరుని చూసి తాను కూడా గన్నుపడతాడు. ఆ ప్రజల తరఫున పోరాడి.. ఆ దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొస్తాడు.దీంతో అతనికి పదవి ఇస్తామని అక్కడి ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా దానిని సున్నితంగా తిరస్కరిస్తాడు.
తర్వాత మళ్ళీ బొలివియా అనే దేశ ప్రజల కోసం పోరాడటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సమస్యలనే ఈ ‘చే’ సినిమాలో ప్రధానంగా చూపించారు. మరోపక్క అతను బుల్లెట్ గాయంతో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్న టైంలో ఓ అమ్మాయి(సమీరా లావణ్య) కుటుంబం ఈయన్ని చేరదీసి వైద్యం అందించి ప్రాణం పోసినట్టు చూపించారు.
ఈ క్రమంలో ఆ అమ్మాయితో చేగువేరా ప్రేమలో పడినట్టు కూడా చూపించారు. అయితే చేగువేరాని ప్రేమించడం వల్ల.. బొలివియా ప్రభుత్వం ఆమెని, ఆమె కుటుంబాన్ని చిత్ర హింసలు చేసినట్టు.. అలా ఈమెను ఎరగా వేసి చేగువేరాని పట్టుకున్నట్టు కూడా చూపించారు. అయితే ఎక్కడి వరకు ఈ చేగువేరా జీవితాన్ని చెప్పారు అనేది మిగిలిన కథగా చెప్పుకోవాలి..!
నటీనటుల పనితీరు: బి.ఆర్ సభావత్ నాయక్ … చేగువేరా అలియాస్ చే పాత్రలో బాగా సెట్ అయ్యాడు. అతని లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. చేగువేరా లాంటి గొప్ప వ్యక్తి పాత్రకి తన వంతు న్యాయం చేశాడు అని చెప్పాలి. హీరోయిన్ లావణ్య సమీరా కూడా గిరిజన యువతిగా చాలా నేచురల్ గా.. కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ వంటి వారు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ కథలో ఎవరి పాత్రను తక్కువ చేయకుండా అందరికీ సమానంగా స్క్రీన్ స్పేస్ ఇవ్వడం అనేది ఇంకో చెప్పుకోదగ్గ విషయం.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఇక్కడ కూడా బి.ఆర్ సభావత్ నాయక్ గురించి చెప్పుకోవాలి. ఆయనే దర్శకుడు కాబట్టి..! ఈ 10 ఏళ్లలో చాలా బయోపిక్ లు వచ్చినా.. ‘చేగువేరా’ బయోపిక్ ను సినిమాగా తీయాలని ఏ దర్శకుడూ ప్రయత్నించలేదు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ‘చేగువేరా’ కథని ఎందుకు ఇప్పటివరకు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఏ దర్శకుడూ చేయలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంలో మాత్రం బి.ఆర్ సభావత్ నాయక్ ను మెచ్చుకోవాల్సిందే. కానీ చరిత్రని తెరపై ఆవిష్కరించడం అనేది చిన్న టాస్క్ కాదు.
సినిమాటిక్ లిబర్టీస్ కనుక తీసుకోకపోతే జనాలకి బోర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ ‘చే’ విషయంలో కూడా అదే జరిగింది. చాలా వరకు చేగువేరా జీవితాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కమర్షియల్ హంగులకి పెద్దపీట వేయలేదు. కొన్ని చోట్ల ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ కలుగుతున్నప్పుడు టెక్నికల్ టీం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశాయి. సినిమాటోగ్రఫీ కథకి తగ్గట్టు బాగా సెట్ అయ్యింది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మిస్ అయ్యింది. అయినా ఓకే..!
విశ్లేషణ: టాలీవుడ్లో ఎన్నో బయోపిక్..లు వచ్చినా… ‘చేగువేరా’ వంటి గొప్ప పోరాటయోధుడి బయోపిక్ ను ఇప్పటి జెనరేషన్ కి చూపించాలి అనే ప్రయత్నాన్ని బట్టి ‘చే’ మూవీకి పాస్ మార్కులు వేయొచ్చు.
రేటింగ్ : 2.25/5