The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • నిధి అగర్వాల్ (Heroine)
  • సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్, సముద్రఖని, బోమన్ ఇరానీ తదితరులు (Cast)
  • మారుతీ (Director)
  • టీజీ విశ్వప్రసాద్ - ఇషాన్ సక్సేనా - వివేక్ కూచిభొట్ల (Producer)
  • థమన్ (Music)
  • కార్తీక్ పళని (Cinematography)
  • కోటగిరి వెంకటేశ్వరరావు (Editor)
  • Release Date : జనవరి 09, 2026
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - IVY ఎంటర్టైన్మెంట్ (Banner)

“కల్కి” అనంతరం ప్రభాస్ (Prabhas) ఫుల్ లెంగ్త్ హీరోగా రూపొంది, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “రాజా సాబ్” (The RajaSaab). మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ & ఫ్యాంటసీ ఎంటర్టైనర్ భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ప్రభాస్ ను చాన్నాళ్ల తర్వాత కామెడీ జోనర్ లో చూడనుండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. మరి మారుతి & ప్రభాస్ కలిసి “రాజా సాబ్”తో ఏమేరకు మెప్పించగలిగారు? అనేది చూద్దాం..!!

The RajaSaab Movie Review

కథ: రాజు (ప్రభాస్) కొన్నేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తాతయ్య కనకరాజు (సంజయ్ దత్)ను వెతుక్కుంటూ చార్మినార్ చేరుకుంటాడు. తానెప్పుడూ తాతయ్యను చూడకపోయినా.. అల్జైమర్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న నానమ్మకి గుర్తున్న ఏకైక వ్యక్తి ఆయనే కావడంతో, ఆమె కోసం ఎంతో కష్టపడి వెతుకుతూ ఉంటాడు.

ఈ క్రమంలో.. తొలిచూపులోనే బ్లెస్సీ (నిధి అగర్వాల్), నిద్రమత్తులో భైరవి (మాళవిక మోహనన్)ను ప్రేమిస్తాడు.

ఆపై తాతయ్యను వెతుక్కుంటూ.. నర్సాపూర్ లో ఉన్న మహల్ కి చేరుకుంటాడు. ఎంట్రీ తప్ప ఎగ్జిట్ అనేది లేని ఆ మహల్ లో రాజు & టీమ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? కనకరాజు ఎందుకని ఆ మహల్ లో ఆత్మలా తిరుగుతున్నాడు? నానమ్మ కోరికను రాజు నెరవేర్చాడా? అందుకోసం ఎంత రిస్క్ చేయాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకి సమాధానమే “రాజా సాబ్” చిత్రం.

నటీనటుల పనితీరు: ప్రభాస్ ను చాలా రోజుల తర్వాత సరదాగా చేస్తాం. కాస్త అక్షయ్ కుమార్ కామికల్ టైమింగ్ ను ఫాలో అయినట్లుగా ఉంటుంది కానీ.. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. లుక్స్ పాటకి, సన్నివేశానికి, ఫైట్ కి మారిపోవడం వల్ల కాస్త ఇబ్బందిపడతాం కానీ.. ప్రభాస్ టైమింగ్ తో కవర్ చేశాడు. అలాగే.. హాస్పిటల్ సీన్ & సంజయ్ దత్ తో మైండ్ గేమ్ ఆడే సన్నివేశాల్లో ఎమోషన్ & సెంటిమెంట్ ను బాగా పండించాడు.

ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ మాత్రమే కాదు, ఓన్లీ హీరోయిన్ అని చెప్పొచ్చు. మాళవిక, రిద్దీ క్యారెక్టర్ రోల్స్ లానే కనిపించారు కానీ.. ఎక్కడా హీరోయిన్ అనిపించలేదు. అయితే.. ముగ్గురు కథానాయికలు సెన్సార్ సర్టిఫికెట్ కి ఇబ్బంది కలిగించకుండా తమ సోయగాలను తెరపై వడ్డించినప్పటికీ.. గ్లామర్ విషయంలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. నిధి, మాళవిక లుక్స్ బాలేవు.. ఇక రిద్దీ అయితే ప్రభాస్ పక్కన పిట్టలా ఉంది.

సంజయ్ దత్ క్యారెక్టర్ ఆర్క్ లో క్లారిటీ లేకపోయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. జరీనా వహాబ్ పోషించిన నాయనమ్మ గంగమ్మ పాత్రకి మంచి వెల్యూ ఉన్నప్పటికీ.. సరిగా వినియోగించుకోలేదు.

బోమన్ ఇరానీ పాత్ర చిన్నదే అయినా.. కథనాన్ని స్పీడప్ చేయడంలో ఉపయోగపడింది. సముద్రఖని, విటివి గణేష్ ల పాత్రలు సడన్ గా ఎంట్రీ & ఎగ్జిట్ ఇచ్చాయి.

సత్య, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులు నవ్వించడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు.

సాంకేతికవర్గం పనితీరు: తమన్ మ్యూజిక్ బాగున్నా.. మిస్కింగ్ లో క్లారిటీ మిస్ అయ్యింది. అందువల్ల పాటలు, మాటలు కూడా చాలా చోట్ల సరిగా వినిపించలేదు. సహన సహన పాట బాగుంది. ఆల్బమ్ కి హైలైట్ కూడా.

సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ.. సీన్ లోని ఎమోషన్ కి తగ్గట్లుగా కాకుండా సినిమా మొత్తం బ్రైట్ గానే ఉండడం అనేది ఆడియన్స్ ను గైడ్ చేయలేకపోయింది. కలరింగ్ & సీజీ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది. సంజయ్ దత్ పాత్రను బ్రహ్మరాక్షసుడిగా చూపించిన ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ.. నాలుగైదు సార్లు చూపించిన పిల్లి, జంప్ స్కేర్ షాట్స్ ఆకట్టుకోలేదు. అన్నిటికీ మించి.. క్లైమాక్స్ లో వచ్చే అంత్యక్రియల ఎపిసోడ్ ను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 600 కోట్ల సినిమాలో ఇలా గ్రీన్ మ్యాట్ షాట్స్ అర్థమవుతున్నాయి అంటే మేకర్స్ తల దించుకోవాల్సిన విషయం.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం సినిమాకి భారీతనం తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ.. సీజీ వర్క్ వల్ల తేలిపోయింది.

దర్శకుడు మారుతి.. ముందుగా ప్రభాస్ లో ఫ్యాన్స్ & రెగ్యులర్ సినిమా ఆడియన్స్ మిస్ అవుతున్న ఫన్ యాంగిల్ ని సరికొత్తగా ఆవిష్కరిద్దామనుకున్న ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. కానీ.. హారర్ & ఫ్యాంటసీ జోనర్ లో సైకాలాజీని ఇరికించడం అనేది సరిగా వర్కవుట్ అవ్వలేదు. మైండ్ గేమ్ ఎపిసోడ్స్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. వాటిని సాగదీసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. 189 నిమిషాల సినిమాలో ఆఖరి 30 నిమిషాలు మాత్రమే బాగుంటే సరిపోతుందా అంటే కచ్చితంగా కాదు.

ఇక మరీ ముఖ్యంగా టీజర్ రిలీజ్ నుండి అందరూ ఎగ్జైట్ అయిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అనేది కంప్లీట్ గా సినిమా నుండి తీసేయడం అనేది పెద్ద డిజప్పాయింట్మెంట్. అలాగే.. ప్రభాస్ కోసం ఇరికించానని చెప్పిన ముగ్గురు హీరోయిన్ల ట్రాక్ అనేది వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్ గా.. మారుతి రచయితగా కాస్త పర్వాలేదనిపించుకున్నాడు కానీ, దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

విశ్లేషణ: ప్రతి జోనర్ కి ఒక స్పెషాలిటీ & ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ప్రేక్షకుడు ఫలానా సినిమాకి వస్తున్నప్పుడు జోనర్ బట్టి కచ్చితంగా కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తాడు. ఆ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందిస్తూనే, ఆశ్చర్యపరచాల్సిన బాధ్యత మేకర్స్ ది. “రాజా సాబ్” (The RajaSaab) టీమ్ ఐడియా పరంగా దాన్ని అచీవ్ చేసారు కానీ.. ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం దారుణంగా తడబడ్డారు. ఉదాహరణకి.. సహన సాంగ్ తొలి చరణాన్ని ఫస్టాఫ్ లో, రెండో చరణాన్ని సెకండాఫ్ లో వినియోగించాలానే ఆలోచన బాగున్నా.. దాని ప్లేస్మెంట్ సెట్ అవ్వలేదు.

ఇలా బెడిసికొట్టిన ఐడియాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ అనేది సరిగా పండలేదు. ప్రభాస్ కాస్త ప్రయత్నించినా.. ఆ సీన్స్ ని అన్నిచోట్ల నవ్వు రాలేదు. ఓవరాల్ గా.. “రాజా సాబ్” (The RajaSaab) ప్రభాస్ కామెడీ టైమింగ్ & ఆఖరి 30 నిమిషాల గ్రాఫిక్స్ తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: మిక్స్డ్ జోనర్ సినిమాలో మైండ్ గేమ్ వర్కవుట్ అవ్వలేదు మారుతి సాబ్!

రేటింగ్: 2.5/5

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus