బేబీ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సాయి రాజేష్, ఎస్ కె ఎన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). కాకపోతే ఈ సినిమాకి సాయి రాజేష్ డైరెక్షన్ చేయలేదు. రవి నంబూరి అనే సీనియర్ రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేశారు. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి. బేబీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ట్రైలర్ లోనే కల్ట్ క్లాసిక్ అని వేసుకున్నారు. మరి ఆ స్టేట్మెంట్ కి ఈ సినిమా జస్టిఫికేషన్ చేసిందా? తెలుసుకుందాం రండి :
కథ: 3 ఏళ్ల పాటు ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కే టైంలో ప్రియురాలు నివేదిత అలియాస్ నివిని (Sri Gouri Priya) వదిలేసి వెళ్లిపోతాడు అజయ్ (త్రిగుణ్). ఈ విషయంపై నిలదీస్తే.. జో (మౌనిక రెడ్డి) అనే అమ్మాయిని ప్రేమించానని, ఆమె కోసమే వెళ్లిపోతున్నానని నివికి చెబుతాడు.
ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో డిప్రెషన్‌కు గురైన నివి, తన ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తాగుడుకు బానిస అవుతుంది. అదే టైంలో నివికి, అలాగే ఆమె ఫ్రెండ్స్‌కి దేవుడు అలియాస్ స్టీవెన్ శంకర్ (Kiran Abbavaram) పరిచయం అవుతాడు.
అతను డైరెక్టర్ అవ్వాలని చెన్నైకి వస్తాడు. డైరెక్షన్ ఛాన్స్ కోసం బాగా స్ట్రగుల్ అవుతుంటాడు. మొదట్లో స్టీవెన్ అంటే నివికి నచ్చదు. ఒక దశలో అతనితో పెద్ద గొడవ కూడా పెట్టుకుంటుంది..! కానీ, తర్వాత అతనిపై జాలి పడుతుంది. అతని ప్యాషన్ చూసి, దర్శకుడు పి. వాసు వద్ద అవకాశం ఇప్పిస్తుంది.
ఆమె చేసిన సాయానికి స్టీవెన్ ఆమెకు దాసుడైపోతాడు. దీంతో తన ఫస్ట్ లవ్‌ను మర్చిపోయి, స్టీవెన్‌ను పెళ్లి చేసుకోవాలని నివి డిసైడ్ అవుతుంది. అదే సమయంలో స్టీవెన్ కూడా తన మొదటి సినిమాకు అవకాశం సంపాదిస్తాడు. అంతా హ్యాపీ అనుకున్న టైంలో వీరి జీవితాల్లో ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంటుంది. అదేంటి? దాని వల్ల వీరి జీవితాలు ఏమయ్యాయి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ఈ విభాగంలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా. ఈమె లుక్స్ ఎంత నేచురల్ గా ఉన్నాయో.. పెర్ఫార్మెన్స్ కూడా అంతే నేచురల్ గా ఉంది అని చెప్పాలి. పక్కన ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా .. అందరినీ తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేసింది. ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం చేసిన సినిమాల్లో… బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. ఇతను పలికిన కొన్ని వన్ లైనర్స్ కూడా పేలాయి. ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. త్రిగుణ్ ఒక రకంగా సెకండ్ హీరో టైపు పాత్ర చేశాడు అని చెప్పాలి. బాగానే చేశాడు. సిరి హనుమంతు ఫ్రెండ్ రోల్లో ఓకె అనిపించింది. మిగతా నటీనటుల పాత్రల సంగతి ఎలా ఉన్నా.. వారికి మంచి స్క్రీన్ స్పేస్ అయితే దొరికింది అని చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. రిలీజ్‌కి ముందే, అంటే ట్రైలర్‌లోనే ‘చెన్నై లవ్ స్టోరీ’కి (Chennai Love Story) కల్ట్ క్లాసిక్ అనే బిరుదు ఇచ్చేసుకున్నారు మేకర్స్. దానికి తగ్గట్టు ఈ సినిమా కథాకథనాలు ఉన్నాయా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే షాకింగ్ ఫ్యాక్టర్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. సెకండాఫ్‌పై ఎగ్జైట్‌మెంట్ కూడా క్రియేట్ చేయదు. కానీ, సెకండాఫ్‌లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని ఆశించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు, కుక్కల ఫైట్ మినహా ఏదీ ఎక్సైటింగ్‌గా అనిపించదు.
ప్రేమకథల్లో బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఎమోషన్ అనేది వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయి. ‘బేబీ’ సినిమాకి ప్లస్ అయ్యింది.. ఇందులో మిస్ అయ్యింది అదే! తీయడానికి కథేమీ లేనప్పుడు సాగదీయడం తప్ప చేసేది ఏమీ ఉండదు. దర్శకుడు రవి నంబూరి చేసింది కూడా అదే. సాయి రాజేష్ రైటింగ్‌లో కొన్ని సంభాషణలు సోషల్ మీడియా జనాలకు, నిబ్బా-నిబ్బీలకు కనెక్ట్ అవ్వొచ్చు.
సెకండాఫ్ లో అక్కడక్కడా అందాల రాక్షసి వంటి సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి. అయితే మణిశర్మ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్, ఒక రకంగా ఈ సినిమాకి ప్రాణం పోసింది అదే. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంది. చాలా పోర్షన్‌ను ట్రిమ్ చేయొచ్చు, కానీ ఎడిటర్‌కి ఆ ఫ్రీడమ్ లభించలేదు అనుకుంటా. ఇక సినిమాటోగ్రఫీ వర్క్‌కి వంక పెట్టాల్సిన పనిలేదు.
విశ్లేషణ: ‘కలర్ ఫోటో’ ‘బేబీ’ వంటి హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీలతో యువతను ఆకట్టుకున్న సాయి రాజేష్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ తో (Chennai Love Story) ఆ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయలేకపోయాడు. భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే కష్టమే. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్లేవారికి పర్వాలేదు అనిపించొచ్చు.
ఫోకస్ పాయింట్: ప్రేమకథ కాదు ఆత్మ వ్యధ
రేటింగ్: 2/5