Chiranjeevi: పద్మవిభూషణ్ అవార్డు పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

  • January 26, 2024 / 08:58 AM IST

మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇది కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు కూడా గర్వపడే సమయం అని చెప్పాలి. ఇక ఈ సంతోష సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో బైట్ ద్వారా తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడమే కాకుండా ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు అని చెప్పాలి.

వీడియో బైట్ ద్వారా చిరంజీవి మాట్లాడుతూ.. “పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందన్న క్షణం.. నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీని పరిస్థితి. మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ,ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నాను. అందుకే నాకు దక్కినటువంటి ఈ గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ , ఆప్యాయతలకు నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ళ సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేర నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను.

నిజజీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి,గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. జైహింద్” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus