తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో “కలర్స్ స్వాతి”గా చెరగని సంతకం చేసిన స్వాతి రెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. మలేసియాకి చెందిన పైలట్ వికాస్ ను ఆగస్ట్ 30న పెళ్లాడనుంది. హైద్రాబాద్ లో అంగరంగా వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకి ఇండస్ట్రీ ప్రముఖులందరూ విచ్చేయనున్నారు. సెప్టెంబర్ 2న కొచ్చిన్ లో రిసెప్షన్ ను ఎరేంజ్ చేస్తున్నారు. “డేంజర్, అనంతపురం, ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే” లాంటి సినిమాలతో నటిగా విశేషమైన గుర్తింపు, ఫాలోయింగ్ సంపాదించుకొన్న స్వాతి.. అనంతరం డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ మారి ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.
చాన్నాళ్ల తర్వాత “స్వామి రారా, కార్తికేయ” వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకొన్నప్పటికీ.. కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేయనని చెప్పేయడంతోపాటు.. సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సుముఖత చూపకపోవడంతో ఆమె ఎక్కువ సినిమాల్లోనూ నటించలేదు. ఆమె నటించిన ఆఖరి చిత్రం “త్రిపుర” ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో స్వాతి సినిమాలకి దూరంగానే ఉంటుంది. మరి పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా స్వస్తి పలుకుతుందా లేక ఇప్పటికైనా సపోర్టింగ్ రోల్స్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.