Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దుల్క‌ర్ స‌ల్మాన్‌ (Hero)
  • సాత్విక వీర‌వ‌ల్లి (Heroine)
  • శృతి హాస‌న్‌, రుహానీ శ‌ర్మ‌, స్వాసిక‌, గౌత‌మ్ మీన‌న్‌, కోట జ‌య‌రామ్‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు (Cast)
  • ప‌వ‌న్ సాదినేని (Director)
  • సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం (Producer)
  • జీవీ ప్ర‌కాష్ కుమార్‌ (Music)
  • సుజీత్ సారంగ్‌ (Cinematography)
  • ప్ర‌వీణ్ కేఎల్‌ (Editor)
  • Release Date : 20th న‌వంబ‌ర్‌ 2026
  • గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా (Banner)

“సీతారామం”, “ల‌క్కీ భాస్క‌ర్” బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ “ఆకాశంలో ఒక తార‌” (Aakasamlo Oka Tara). ప‌వ‌న్ సాదినేని ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతో సాత్విక వీర‌వ‌ల్లి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శృతి హాస‌న్‌, రుహానీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. గీతా ఆర్ట్స్‌, స్వ‌ప్న సినిమాస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించారు. ఆకాశంలో ఒక తార సినిమాతో తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్‌కు మ‌రో హిట్టు ద‌క్కిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే..

Aakasamlo Oka Tara Movie Review

క‌థ‌: క‌ల్ప‌న (సాత్విక వీర‌వ‌ల్లి) అలియాస్ అమ్ములుది పాల‌లంక అనే చిన్న‌ప‌ల్లెటూరు. చ‌దువులో టాప‌ర్‌. చిన్న‌త‌నం నుంచి ఆస్ట్రోనాట్ కావాల‌ని క‌ల‌లు కంటుంది. కానీ కూతురిని చ‌దివించ‌డం ఆమె తండ్రికి ఇష్టం ఉండ‌దు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్త‌వ్వ‌గానే కృష్ణ (దుల్క‌ర్ స‌ల్మాన్‌)అనే అబ్బాయితో క‌ల్ప‌న పెళ్లి జ‌రిపిస్తాడు. క‌ల్ప‌న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో జిల్లా టాప‌ర్ వ‌చ్చింద‌ని తెలుసుకున్న కృష్ణ‌…ఆస్ట్రోనాట్ కావాల‌నే భార్య‌ క‌ల‌ను ఎలాగైనా నిజం చేయాల‌ని అనుకుంటాడు.

ఈ ప్ర‌య‌త్నంలో కృష్ణ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? క‌ల్ప‌న‌ను ల‌క్ష్యం దిశ‌గా ఏ విధంగా న‌డిపించాడు? త‌క్కువ ఖ‌ర్చుతో రాకెట్ చేయాల‌నే అమ్ములు ప్ర‌య‌త్నం ఎందుకు విఫ‌ల‌మైంది? క‌ల్ప‌న టాలెంట్‌ను న‌మ్మిన రోహిణి (శృతి హాస‌న్‌) ఎవ‌రు? కృష్ణ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ క‌ల్ప‌న‌ ఆస్ట్రోనాట్ అయ్యిందా? అంత‌రిక్షంలో అడుగుపెట్టిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: క‌థ‌ల ఎంపిక‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ ఆలోచ‌న విధానం ఎంత విభిన్నంగా ఉంటుందో చెప్ప‌డానికి ఆకాశంలో ఒక తార బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. హీరోయిజం, ఫైట్స్‌, డ్యాన్స్‌లు లాంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి పాత్ర‌ను చేయ‌డానికి చాలా గ‌ట్స్ ఉండాలి. ద‌ర్శ‌కుడి విజ‌న్‌, క‌థ‌ను న‌మ్మి దుల్క‌ర్ ఈ సినిమా చేశారు. కృష్ణ పాత్ర‌లో జీవించాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో దుల్క‌ర్ న‌ట‌న క‌దిలిస్తుంది.

సాత్విక వీర‌వ‌ల్లికి హీరోయిన్‌గా ఇదే మొద‌టి సినిమా. కానీ ఆ కెమెరా ఫియ‌ర్ ఎక్క‌డ క‌నిపించ‌లేదు. ఆస్ట్రోనాట్ కావాల‌ని క‌ల‌లు క‌నే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ఒదిగిపోయింది. చాలా చోట్ల క‌ళ్ల‌తోనే న‌టించింది. దుల్క‌ర్‌, సాత్విక జంట బాగుంది. వీరిద్ద‌రి పాత్ర‌ల చుట్టే క‌థ ఎక్కువ‌గా సాగుతుంది. డేరింగ్ అండ్ డాషింగ్‌గా క‌నిపించే మోడ్ర‌న్ అమ్మాయిగా శృతి హాస‌న్ రోల్ సెకండాఫ్‌కు కీల‌కంగా నిలిచింది. రుహానీ శ‌ర్మ‌, స్వాసిక‌ల‌వి చిన్న పాత్ర‌లే అయినా డీ గ్లామ‌ర్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. ముర‌ళీశ‌ర్మ‌, గౌత‌మ్ మీన‌న్‌, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, ప్ర‌వీణ్‌, కోట జ‌య‌రామ్ త‌మ అనుభ‌వంతో మెప్పించారు. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాదినేని ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు, ట్రెండ్ గురించి ఆలోచించ‌కుండా చాలా నిజాయితీతో ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాదినేని ఈ క‌థ‌ను రాసుకున్నాడు. రాత‌లోనే కాదు తీత‌లో కూడా ఆ జెన్యూనిటీ క‌నిపించింది. కావాల‌ని అనుకుంటే క్రియేటివ్ లిబ‌ర్టీ తీసుకొని డ్యూయెట్లు పెట్ట‌వ‌చ్చు. రొమాంటిక్ సీన్లు ఇరికించ‌వ‌చ్చు. కానీ వాటి గురించి ద‌ర్శ‌కుడు అస్స‌లు ఆలోచించ‌లేదు. ఎక్క‌డ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా తాను ఏదైనా రాసుకున్నాడో అదే స్క్రీన్‌పై చూపించాడు.

ద‌ర్శ‌కుడికి సాంకేతిక నిపుణుల నుంచి మంచి స‌పోర్ట్ దొరికింది. క‌థ‌లోని ఎమోష‌న్‌ను చివ‌రి వ‌ర‌కు క్యారీ చేయ‌డానికి జీవీ ప్ర‌కాష్ కుమార్ బీజీఎమ్‌, పాట‌లు ఉప‌యోగ‌ప‌డ్డాయి. సుజీత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అంత‌రిక్షం ఎపిసోడ్స్‌ తాలూకు వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ నాచుర‌ల్‌గా ఉన్నాయి. బాక్సాఫీస్ పారామీట‌ర్స్ గురించి ఆలోచించ‌కుండా ఇలాంటి క‌థ‌ల‌తో సినిమా నిర్మించ‌డానికి నిర్మాత‌లు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మే. ఆ విష‌యంలో గీతా ఆర్ట్స్‌, స్వ‌ప్న సినిమాస్‌తో పాటు సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ల‌ను మెచ్చ‌కోవ‌చ్చు.

విశ్లేష‌ణ‌: ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఓ ఆడ‌ది ఉంటుంద‌ని అంటుంటారు. అలాంటి వాళ్ల క‌థ‌లు ప్ర‌తిరోజు వినిపిస్తుంటాయి. కానీ ఆడ‌వాళ్ల విజ‌యాల వెనుక ఉండే మ‌గాళ్ల క‌థ‌లు చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి. ఆకాశంలో ఒక తార అలాంటి క‌థే. త‌న భార్య క‌ల‌ను నిజం చేయ‌డానికి ఓ భ‌ర్త సాగించే నిస్వార్థ‌మైన ప్ర‌యాణం, అత‌డు చేసే త్యాగాలు, ప‌డే క‌ష్టాల‌తో ఎమోష‌న‌ల్ రోల‌ర్‌కోస్ట‌ర్ రైడ్‌లా ఈ సినిమా సాగుతుంది.

క‌ల‌లు ప్ర‌తి ఒక్క‌రూ కంటుంటారు. స‌రైన ప్రోత్సాహం, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఉన్న‌ప్పుడే వాటిని నిజం చేసుకోగ‌లుగుతామ‌నే మెసేజ్ ఇచ్చారు. మ‌న క‌ల‌ల‌ను, ల‌క్ష్యాల‌ను చూసి అవ‌హేళ‌న చేసేవాళ్లు ఎంత మందైనా ఉండొచ్చు. కానీ వాటిని న‌మ్మే ఒక్క వ్య‌క్తిని సంపాదించుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌నే చాటిచెప్పారు. అప‌జ‌యాలు, అడ్డంకుల‌ను చూసి ల‌క్ష్యాల‌ను ప‌క్క‌న‌పెట్ట‌ద్ద‌ని చూపించారు.మ‌హిళా సాధికార‌త‌, ఆడ‌పిల్ల‌ల చ‌దువు గురించి ఆలోచ‌నాత్మ‌కంగా సినిమాలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు.

క‌ల్ప‌న చిన్న‌నాటి స‌న్నివేశాల‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆస్ట్రోనాట్ కావాల‌నే ల‌క్ష్యం ఎలా మొద‌లైందో చూపిస్తూ క‌థ‌లోకి వెళ్లిన తీరు బాగుంది. భార్యను చ‌దివించ‌డం కోసం కృష్ణ ప‌డే క‌ష్టాల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది. త‌న క‌ల‌కు దూర‌మైన క‌ల్ప‌న జీవితంలోకి రోహిణి ఎంట్రీ ఇవ్వ‌డం, ఆమె ద్వారా క‌ల్ప‌న ఎలా ఆస్ట్రోనాట్ అయ్యింద‌న్న‌ది సెకండాఫ్‌లో చూపించారు.

ఆకాశంలో ఒక తార సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ చెప్పిన విధాన‌మే ఆర్ట్ సినిమాను త‌ల‌పించింది. హీరోయిన్ రాకెట్ త‌యారు చేసే సీన్లు, సెకండాఫ్‌లో శృతి హాస‌న్ ఎపిసోడ్స్ ఆస్ట్రోనాట్ క్లాసుల‌ను త‌ల‌పించాయి. క్లైమాక్స్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఎక్కువే టైమ్ తీసుకున్నాడు. సినిమా చాలా నెమ్మ‌దిగా సాగిన అనుభూతి క‌లుగుతుంది. క‌థ‌లోని లోపాల‌ను దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాత్విక‌, శృతి హాస‌న్ త‌మ న‌ట‌న‌తో క‌వ‌ర్ చేశారు.

ఫోక‌స్ పాయింట్‌: ఆకాశంలో ఒక తార నిజాయితీతో కూడిన విభిన్న‌మైన ప్ర‌య‌త్నం. తెలుగులో మంచి సినిమాలు రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా ఈ సినిమా నిలుస్తుంది. అవార్డులు రావ‌డం ప‌క్కా. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత వ‌ర‌కు హిట్ట‌వుతుంద‌న్న‌దే అనుమానం.

రేటింగ్‌: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus