Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
- October 16, 2026 / 02:10 PM ISTByPhani Kumar
Cast & Crew
- అఖిల్ రాజ్ (Hero)
- అనుపమ పరమేశ్వరన్ (Heroine)
- నరేష్ వి కె, తరుణ్ భాస్కర్, చైతన్య రావ్, హర్షవర్ధన్, కిరీటీ దామరాజు తదితరులు (Cast)
- భద్రప్ప గాజుల (Director)
- బూసం జగన్ మోహన్ రెడ్డి (Producer)
- సురేష్ బొబ్బిలి (Music)
- శ్యామ్ ధూపతి (Cinematography)
- శ్రవణ్ కటికనేని (Editor)
- Release Date : 16th అక్టోబర్ 2026
- ఆరో సినిమాస్ (Banner)
దసరా కానుకగా 4 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘క్రేజీ కళ్యాణం’ (Crazy Kalyanam) ఒకటి. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ వంటివి కలర్ఫుల్గా కనిపించాయి. సీనియర్ నరేష్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి:
Crazy Kalyanam Movie Review

కథ: పర్వతాలు (నరేష్) తన పెద్దల్లుడు, పచ్చి తాగుబోతు, తిరుగుబోతు అయినటువంటి బాలరాజు (తరుణ్ భాస్కర్) కారణంగా ఊర్లో జనాలతో తిట్లు తింటూ అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. తన అన్న మాట నమ్మి బాలరాజుని తన పెద్ద కూతురికి ఇచ్చి పెళ్లి చేసి, ఆమె గొంతు కోశానని రోజూ కుమిలిపోతూ ఉంటాడు పర్వతాలు. పెద్ద కూతురి విషయంలో జరిగిన తప్పు చిన్న కూతురు కీర్తి (Anupama Parameswaran) విషయంలో జరగకూడదని దృఢంగా నిశ్చయించుకుంటాడు.
దీంతో తన అన్న కూతుర్ని చూసుకోవడానికి వచ్చిన అమెరికా పెళ్లికొడుకు విశ్వని (కిరీటి) మాయ చేసి, కీర్తి వైపు దృష్టి మళ్లిస్తాడు. అలా కీర్తి పెళ్లి సెట్ చేస్తాడు. అయితే కీర్తి మాత్రం తన చిన్ననాటి స్నేహితుడైన ఉదయ్‌ని (అఖిల్ రాజ్) ప్రేమిస్తుంది. అంతేకాదు, బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాక కానీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. తన కూతురి ప్రేమ విషయం తెలిసి పర్వతాలు ఎలా రియాక్ట్ అయ్యాడు? తండ్రి చాదస్తం వల్ల కీర్తి లైఫ్‌లో వచ్చిన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: అనుపమ పరమేశ్వరన్ ఎంత మంచి నటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో కీర్తి పాత్రకు తన అనుభవాన్నంతా జోడించి న్యాయం చేసే ప్రయత్నం చేసింది. కానీ తన క్యారెక్టర్లో డెప్త్ లేకపోవడం వల్ల ఆ భారాన్ని చివరి వరకు మోయలేకపోయింది. సీనియర్ నరేష్ నటనకు వంకలు పెట్టలేం. అతనికి అనుపమ కంటే బెటర్ రోల్ దొరికింది, చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు మాత్రం ఆయన చాలా ఇబ్బంది పడిన ఫీలింగ్ కలుగుతుంది.
కొన్ని సన్నివేశాల్లో యాస లేకుండా నార్మల్‌గానే మాట్లాడేశాడు. క్లైమాక్స్‌లో తల్లి పాత్ర చనిపోయినట్టు చూపించిన సన్నివేశాల్లో.. నరేష్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టించాడని చెప్పాలి. ఈ సినిమాకు అఖిల్ రాజ్ హీరో అయినప్పటికీ, అతని పాత్ర గెస్ట్ రోల్‌కు ఎక్కువ, హీరో రోల్‌కు తక్కువ అన్నట్టు ఉంది. ఉన్న కాసేపు తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్తో మెప్పించే ప్రయత్నం చేశాడు. తరుణ్ భాస్కర్ పోషించిన బాలరాజు పాత్ర బాగుంది. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కూడా అదే. తరుణ్ కూడా బాగా సెట్ అయ్యాడు. కాకపోతే ఈ పాత్రతో మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు ఆ ఛాన్స్‌ను కరెక్ట్‌గా వాడుకోలేకపోయాడు. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘తెలంగాణ సాంప్రదాయంలో పెళ్లి’.. ఈ థీమ్ తో మొన్నమధ్య ‘లగ్గం’ అనే సినిమా వచ్చింది. దాదాపు దానికి చాలా సిమిలర్‌గా ఉన్న సినిమా ఈ ‘క్రేజీ కళ్యాణం’. అయితే క్యాస్టింగ్ పరంగా ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనిని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. ప్రమోషన్స్‌లో సీనియర్ ఎన్టీఆర్ రేంజ్ నటుడు చేయాల్సిన పాత్రని తాను చేసినట్టు నరేష్, ఇది ‘శతమానం భవతి’ లాంటి సినిమా అంటూ అనుపమ.. ఇలా చాలా పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చారు. దురదృష్టవశాత్తూ వాళ్ళు చెప్పిన స్థాయిలో ఈ సినిమా లేకపోవడం బాధాకరం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది.
నరేష్, తరుణ్ భాస్కర్ల కామెడీ టైమింగ్‌తో అలా గడిచిపోతుంది. కానీ సెకండాఫ్ మాత్రం ఎంతకీ ముందుకు సాగదు. కథ మొత్తం అక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సింపుల్‌గా ఎండ్ చేయాల్సిన కథని సాగదీసి.. ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారు. క్లైమాక్స్‌లో నరేష్ తల్లి చనిపోయినట్టు చూపించడం, తర్వాత పెళ్లి పీటలమీద ఉండాల్సిన హీరోయిన్ ఎం.ఆర్.ఓ పోస్ట్ కోసం సంతకాలు చేయడానికి వెళ్లినట్టు చూపించడం.. ఇవన్నీ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. అయితే నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే ఓకే. సినిమాటోగ్రఫీ సినిమా క్వాలిటీ తగ్గకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ బాగుంది. సురేష్ బొబ్బిలి ఆర్ ఆర్ తో కూడా మెప్పించారు.

విశ్లేషణ: మరో ‘శతమానం భవతి’ రేంజ్లో కాకపోయినా ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యే కోర్ పాయింట్, సెటప్ ఈ సినిమాలో ఉన్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా లేకపోవడంతో ఈ సినిమా స్థాయి తగ్గింది.

ఫోకస్ పాయింట్: పై పై అలంకరణలే
రేటింగ్: 2.25/5














