స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అరుదైన రికార్డులను సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన బాలయ్య అభిమానులు అఖండను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఓటీటీలో అఖండ వ్యూస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే స్టార్ హీరో బాలకృష్ణ అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఓటీటీలో అఖండ సినిమాను చూసిన ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు బాలయ్యను డైరెక్ట్ గా కలవవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం 500 మంది అభిమానులకు మాత్రమే వర్తిస్తుంది. జనవరి 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అఖండ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ ఆఫర్ కు అర్హులు.
హాట్ స్టార్ లో సినిమాను చూసి ఆ తర్వాత #AkhandaRoarOnHotstar హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేసిన అభిమానులు ఈ ఆఫర్ కు అర్హులు అవుతారు. లక్కీ డ్రా ద్వారా అభిమానుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ ఆఫర్ బాలయ్య ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. హాట్ స్టార్ బాలయ్య అభిమానుల కోసం ఈ స్పెషల్ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. హాట్ స్టార్ అఖండ డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తం ఖర్చు చేసిందని తెలుస్తోంది.
సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ ఆ సినిమాలను మించి ఘన విజయం సాధించింది. ఫస్టాఫ్ తేలిపోయినా సెకండాఫ్ అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంది. అఖండ సక్సెస్ తో బాలయ్య తన తరువాత సినిమాలు కూడా సక్సెస్ సాధించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.