ఇటీవల దర్శకరత్న దాసరి నారాయణ రావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతని మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వారికి కొన్ని వివరాలు లభించాయి. ఈ నెల 5న రాత్రి చెన్నై నుండీ హైదరాబాద్ కి వచ్చిన ప్రభు ఈ నెల 7వ తేదీ వరకు కూకట్ పల్లిలో తన పెద్ద అల్లుడు ఇంట్లో ఉన్నాడని, కానీ 8వ తేదీ నుండీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో తన ఆఫీస్ కి వెళ్ళి ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే బస చేసినట్టు పోలీసులు తెలిపారు.
అంతేకాదు జూన్ 9 సాయంత్రం వరకూ అయన ఇంట్లోనే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడని తరువాత ఆటో ఎక్కి బయటకి వెళ్ళిపోయాడని తెలిపారు. అదేరోజు సాయంత్రం అతడి భార్య పద్మావతి.. ప్రభుకి ఫోన్ చేయగా, ఫోన్ రింగ్ అయినా కాల్ కట్ అవుతుందన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు. అతడి ఆచూకి తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రభు చిత్తూరు బస్ ఎక్కినట్లు గుర్తించడం గమనార్హం. ఇప్పుడు చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యి అక్కడ కూడా గాలించడం ప్రారంభించారు.