‘డైనోసార్ వస్తోంది జరగండి జరగండి…’ అంటూ ఈ మధ్య ‘సలార్’ టీమ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడో కర్చీఫ్ వేసుకుని రిలీజ్ రెడీ చేసుకున్న సినిమాల సంగతి వదిలేసి ఆ డేట్ మాది అంటూ ‘సలార్’ టీమ్ వచ్చేస్తోంది. దీంతో అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమాలు వేరే డేట్‌ను వెతుకుతున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు డిసెంబరు 8 మీద పడింది అంటున్నారు. ఈ మేరకు కొత్త కర్చీఫ్‌లు రెడీ చేసుకుంటున్నాయి సినిమా వర్గాలు అని సమాచారం.
మామూలుగా అయితే డిసెంబరు సినిమా బాగా డ్రై మంత్. ‘ఆ నెలలో సినిమా రిలీజా? ఎందుకు?’ అనే ప్రశ్న వేసేవారు సినిమా జనాలు. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి మారిపోయింది. లాంగ్ వీకెండ్, మంత్ ఎండ్ల కాన్సెప్ట్‌లో డిసెంబరులో కూడా పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి. అలా డిసెంబరు నెలాఖరు కోసం కాచుకు కూర్చున్న కొన్ని సినిమాలు ఇప్పుడు డిసెంబరు మొదటివారానికి వచ్చేస్తున్నాయి. అలా డిసెంబరు 8 డేట్ బాగా బిజీ అవుతోంది.
తొలుత చెప్పుకోవాల్సిన సినిమా (Movies) నాని ‘హాయ్ నాన్న’. ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్ చేయాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయారట. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను డిసెంబరు 8న తీసుకొస్తారని టాక్. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇబ్బందులు లేకుండా ఆ డేట్‌కు ఓకే అయ్యారట.
ఎందుకంటే రెండో వారంలో బాలీవుడ్లో పెద్ద సినిమాలున్నాయి. విజయ్ సేతుపతి – కట్రినా కైఫ్ నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మస్’ను అప్పుడే తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. కుదిరితే ఎనిమిదినే వచ్చేస్తారని టాక్. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా ‘యోధ’ను 15న తీసుకురావాలని టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండూ పాన్ ఇండియా లెవల్ రిలీజ్ సినిమాలే. మరి ఈ డేట్స్ విషయంలో తకరారు ఎప్పటికి తేలుతుందో చూడాలి.