మా హీరోకు అవార్డు రాలేదని బాధలేదు.. కానీ ఆ హీరో సినిమాకు అవార్డు రావడమేంటి? గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఓ ఫక్తు కమర్షియల్ యాక్షన్ సినిమాకు జాతీయ పురస్కారం లభించడమే. అదే ‘రాయన్’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయిగా ఆ సినిమాకే ఎందుకు ఇచ్చారు అంటూ సన్నాయి నొక్కులు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి.
ఈ మాటలు ఆ నోటా ఈ నోటా దాటి ధనుష్ వరకు వెళ్లినట్లున్నాయి. అందుకే ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇటీవల అభిమానులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి వచ్చిన ధనుష్ మాట్లాడుతూ.. “రాయన్’ సినిమాకు నాకు జాతీయ అవార్డు వచ్చింది. 2024లో కచ్చితంగా ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయి. అయినా నాకు అవార్డు దక్కింది. అయినా గతంలో ఎన్నో మంచి సినిమాలు చేశాను. అప్పుడు వాటికి అవార్డులు వస్తాయని అనుకున్నాను కానీ రాలేదు అంటూ అసలు విషయం చెప్పాడు.
ఆ ఏడాది తమిళంలో ‘మెయ్యిళగన్’, ‘మహారాజ’ లాంటి సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు పొందాయి కూడా. కానీ నా సినిమాకు, నాకు అవార్డు వచ్చింది. ఇప్పుడిలా మాట్లాడుతున్నారు కానీ.. గతంలో నేను నటించిన ‘పుదుపేట్టై’, ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియన్’, ‘రాన్‌జ్నా’ లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఎవరూ ఆ సినిమాల గురించి మాట్లాడలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు ధనుష్.
ఒక విధంగా ధనుష్ చెప్పేది కూడా నిజమే. పైన చెప్పిన సినిమాల్లో ఆయన నటన, సినిమా కథాంశం అదిరిపోతాయి. అవార్డు సినిమా అంటూ అందరూ అన్నా.. అవార్డు రానప్పుడు ఇప్పటిలా ఎవరూ గొంతెత్తలేదు. అప్పుడు గొంతెత్తని వారికి ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఉంటుందా చెప్పండి.