గతేడాది సంక్రాంతికి ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎప్పుడూ జరగని విషయం జరిగింది. ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే సీజన్‌లో రెండు సినిమాలు రావడం అంటే పెద్ద విషయమే కదా. అలాంటి ఫీట్ చేసి, రెండు సినిమాలతోనూ విజయం సాధించి అదరగొట్టారు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు. అసలే సంక్రాంతి సీజన్ అంటే హాట్‌కేక్. అలాంటి సమయంలో ఒకే నిర్మాణ సంస్థ నుండి తెరకెక్కిన రెండు సినిమాలకు ఎలా అవకాశం ఇస్తారు అనే ప్రశ్నలు అప్పుడు వచ్చాయి కూడా.
ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అంటే.. ఆ రేర్ ఫీట్‌ను ఈసారి దిల్ రాజు చేద్దాం అనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఒక సినిమా ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉండగా.. ఇటీవల మరో సినిమాను ఆ రేసులోకి తీసుకొచ్చారు దిల్ రాజు (Dil Raju) . దీంతో తొలుత అనుకున్న సినిమా వెనక్కి తప్పుకుంది అనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కూడా లైన్‌లో ఉంది అని అర్థమవుతోంది.
తొలుత అనుకున్న సినిమా వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (రూమర్డ్ టైటిల్) కాగా, కొత్తగా వచ్చిన సినిమా రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) . చరణ్ సినిమాను జనవరి 10న తీసుకొస్తామని అనౌన్స్ చేసిన టీమ్.. వెంకీ సినిమా విషయంలో మౌనంగా ఉంది. అయితే అదేం లేదు ఆ సినిమా పనులు 90 శాతం అయిపోయాయని, డబ్బింగ్ పనులు మొదలయ్యాయని లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. దీంతో కొత్త ఏడాది, కొత్త నెలలో రెండు సినిమాలు అంటున్నారు.
అయితే, రెండూ సంక్రాంతికే వస్తాయా? లేక జనవరి తొలి వారంలో వెంకీ – అనిల్ సినిమా తీసుకొచ్చి.. థియేటర్లను చేతిలో పెట్టుకుని సంక్రాంతికి అంటే జనవరి 10కి ‘గేమ్ ఛేంజర్’ తీసుకొస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఒకే నిర్మాణ సంస్థ నుండి అయితే వారం గ్యాప్‌లో లేదంటే ఒకేసారి రెండు సినిమాలు రావడం ఆసక్తికరమే.