సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తొలిసారి కథానాయకుడిగా ఆయన నటిస్తున్న చిత్రం యెల్లమ్మ. ఈ సినిమాతో DSP ఒక కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో కొత్త చర్చకు కూడా దారి తీస్తోంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది వేణు యెల్దండి. ‘బలగం’ లాంటి రూటెడ్ కథతో ప్రేక్షకుల హృదయాలను తాకిన వేణు, ఈసారి కూడా గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ పల్లెల్లో సెట్ అయిన కథతో, సహజమైన భావోద్వేగాలతో ‘ఎల్లమ్మ’ రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో DSP ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు నెలకు కేవలం పది రోజులే షూటింగ్‌కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రోజుల్లో తన అసలు వృత్తి అయిన సంగీతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఐడియా తనదికాదని, నిర్మాత దిల్ రాజు స్వయంగా ముందుకు వచ్చి ఈ విధంగా ప్లాన్ చేశారని DSP చెప్పారు. తన మ్యూజిక్ కెరీర్‌కు ఎలాంటి ఆటంకం రాకుండా షెడ్యూల్స్‌ను సర్దుబాటు చేస్తామని దిల్ రాజు హామీ ఇచ్చారట.
బహుళ షెడ్యూల్స్‌లో షూటింగ్ జరగనున్నందున సినిమా పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఒకే సినిమాలో నటుడిగానూ, సంగీత దర్శకుడిగానూ దేవి శ్రీ ప్రసాద్ తన ప్రతిభను ఎలా చూపిస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ‘ఎల్లమ్మ’ దేవి కెరీర్‌లో ఒక డిఫరెంట్ మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.