ఒక సినిమాకు మరో సినిమాను పోలిక పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలిక పెట్టిన సినిమా భారీ విజయం సాధించి ఉంటే.. ఈ సినిమాకు కూడా ఆ స్థాయి విజయం పక్కాగా సాధించాలి. లేదంటే అనుకున్న అంచనాలు ఈ సినిమా అందుకోలేకపోతే ఈ ట్రోలింగ్ యుగంలో చాలా మాటలు పడాల్సి వస్తుంది. ఈ విషయంలో పూర్తి స్థాయి అనుభవం ఉన్న యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి భారీ పోలిక పెట్టేశారు. దీంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ఆగస్టు 14న ఏం జరగబోతోంది అనే చర్చ మొదలైంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య – మమితా బైజు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీనే నిర్మించారు. ఆగస్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ఓ ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ తెలుగులో తాము తీసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో.. అదే తరహాలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా కోలీవుడ్‌లో విజయం సాధిస్తుందని చెప్పారు.
వినోదం, సంగీతం, ఎమోషన్ అన్నీ పోటాపోటీగా ఉన్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అందుకే ఆ సినిమాకు ఇండస్ట్రీ హిట్ అనే హోదా వచ్చింది. అందులోనూ ఆ సినిమా బన్నీకి సరైన కమ్ బ్యాక్ ఇప్పించింది. ఆ ఊపులోనే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫలితం మీద అందరి చూపూ పడింది. ఏమైనా తేడా ఫలితం కొడితే.. ఇప్పుడు నాగవంశీ మాటలు అప్పుడు ఆయన మీదకే ఈటెలుగా మారుతాయి.
‘వార్ 2’ సినిమా సమయంలో చూశాం కదా.. తొలి రోజు వసూళ్ల విషయంలో నాగవంశీ ఇచ్చిన టార్గెట్ మాటలు ఆ తర్వాత ఆయనకే టార్గెట్‌గా మారాయి. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.